Breaking News

స్వచ్ఛమైన, నిర్దిష్టమైన ఓటరు జాబితాల రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి

-రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా, నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమై భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) – 2026 కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు పర్చే అంశంపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా వేగవంతమైన పట్టణీకరణ, ఉపాధి మరియు విద్యా అవసరాల కోసం జరిగిన వలసలు, జనాభా మార్పులు వంటి పరిణామాల కారణంగా ఓటరు జాబితాలలో మరణించిన వ్యక్తుల పేర్లు కొనసాగడం, ఒకే వ్యక్తికి బహుళ నమోదులు ఉండడం, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లు తొలగించబడకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు కూడా ఓటరు జాబితాల నాణ్యతపై పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, ప్రజాస్వామ్య విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడానికి ఈ సమగ్ర సవరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం రెండు ప్రధాన లక్ష్యాలతో అమలవుతుందని ఆయన వివరించారు. ప్రతి అర్హత కలిగిన భారత పౌరుడు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు కావడం, అలాగే చనిపోయినవారు, రెండు మూడు చోట్ల నమోదులు కలిగినవారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా అనర్హులైన వ్యక్తులు జాబితాలో లేకుండా చూడడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) – 2026 కార్యక్రమం 01 జూలై 2026ను అర్హత తేదీగా నిర్ణయిస్తూ అమలు చేయబడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 05 జూన్ 2026 నుండి 14 జూన్ 2026 వరకు సన్నాహక కార్యక్రమాలు, శిక్షణ మరియు గణన ఫారాల ముద్రణ చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం 15 జూన్ 2026 నుండి 14 జూలై 2026 వరకు బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి గణన ఫారాల పంపిణీ మరియు సేకరణ నిర్వహిస్తారన్నారు. పోలింగ్ స్టేషన్ల సహేతుకీకరణ కార్యక్రమం 14 జూలై 2026 వరకు కొనసాగుతుందన్నారు.

ముసాయిదా ఓటరు జాబితా 21 జూలై 2026న ప్రచురించబడుతుందని, క్లైములు, అభ్యంతరాల స్వీకరణకు 21 జూలై 2026 నుండి 20 ఆగస్టు 2026 వరకు అవకాశం కల్పించబడుతుందన్నారు. అనంతరం నోటీసులు, విచారణలు మరియు దావాలు–అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ 21 జూలై 2026 నుండి 18 సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుందన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తైన తర్వాత తుది ఓటరు జాబితా 22 సెప్టెంబరు 2026 న ప్రచురించబడుతుందని ఆయన తెలిపారు.

ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి పాక్షికంగా నింపబడిన గణన ఫారాలను (Enumeration Forms) అందజేస్తారని, ఓటర్లు వాటిని ధృవీకరించి తిరిగి సమర్పించాలని సూచించారు. గణన ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చబడవని ఆయన స్పష్టం చేశారు. ఇల్లు తాళం వేసి ఉన్న సందర్భాల్లో BLOలు కనీసం మూడు సార్లు సందర్శిస్తారని తెలిపారు.

కొత్తగా ఓటరు అర్హత పొందిన వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, సవరణలు లేదా బదిలీల కోసం ఫారం-8, అభ్యంతరాల/తోలగింపులు కోసం ఫారం-7 వినియోగించవచ్చని వివరించారు. ముసాయిదా ఓటరు జాబితా మరియు క్లైములు, అభ్యంతరాల వివరాలు CEO వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

ఆధార్ కేవలం గుర్తింపు రుజువు మాత్రమేనని, అది పౌరసత్వం లేదా నివాసానికి చట్టబద్ధమైన రుజువు కాదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల చట్టాల ప్రకారం గుర్తింపు నిర్ధారణ కోసం ఆధార్‌ను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.

ఎటువంటి వ్యక్తి పేరు అయినా విచారణ లేకుండా, కారణాలతో కూడిన ఉత్తర్వు జారీ చేయకుండా ఓటరు జాబితా నుండి తొలగించబడదని హామీ ఇచ్చారు. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దళితులు, గిరిజనులు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక సహాయ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.

ప్రతి పౌరుడు ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించి, తమ గణన ఫారాలను సక్రమంగా సమర్పించాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీ వివేక్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య బలోపేతం కోసం ఓటరు జాబితాల స్వచ్ఛతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు పర్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో టిడిపి ప్రతినిధులు పి. అశోక్ బాబు, కోనేరు సురేష్, కే. రాజ శేఖర్, జనసేన పార్టీ తరఫున ఇ. సాంబశివ ప్రతాప్, వైసిపి ప్రతినిధులు పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎల్. అప్పిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఏ ఎన్ ఎన్ మూర్తి, ఎన్ చంద్ర శేఖర్ రెడ్డి, బీజేపీ ప్రతినిధులు నాగోతు రమేష్ నాయుడు, వి. శ్రీనివాస రాజు, వెన్న హేమంత్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా. టి. సేవా కుమార్, ఏ. బాలాజీ రెడ్డి, సి.పి.ఐ(ఎం) నాయకులు, వై. వెంకటేశ్వరరావు, జే. జయరాం పాల్గొన్నారు. వీరితో పాటు అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎ. వెంకటేశ్వరరావు, సహాయ ప్రధాన ఎన్నికల అధికారి జి. శ్రీనివాసరావు తదితర అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *