-ఆన్లైన్ పన్నుల వసూళ్లతో విధానంతో పారదర్శకత పెరుగుతుంది
-రాజవోలు గ్రామ పంచాయతీలో స్వయంగా ఆన్లైన్ పన్నుల విధానాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుంది. పంచాయతీ పన్నుల వసూలు ప్రక్రియ సరికొత్త మార్గంలో ముందుకు వెళ్లడం శుభపరిణామం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో పన్ను వసూళ్లు ఉండేవని, దీన్ని పూర్తిగా మార్చి మొత్తం ఆన్లైన్ విధానం తీసుకు వచ్చామని చెప్పారు. పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానాన్ని ఉప ముఖ్యమంత్రి మంగళవారం స్వయంగా పరిశీలించారు. రాజమండ్రి రూరల్ మండలం, రాజవోలు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జరుగుతున్న పన్నుల వసూలు విధానాన్ని పరిశీలించారు. పన్నులను ఆన్లైన్లో కడుతున్న వారితో మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పని చేస్తుంది. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేస్తుంది. పంచాయతీలు స్వావలంబన సాధించాలంటే, ఆర్థికంగా వృద్ధి చెందాలి. స్వయంగా ఆదాయం ఆర్జించే స్థాయికి పంచాయతీలు రావాలి. ప్రతి అభివృద్ధి పనికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంతంగా అభివృద్ధి చేసుకునే దశకు పంచాయతీలు రావాలి. దీనికోసం ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహిస్తోంది. నూతన విధానాలను పంచాయతీలు కూడా అందిపుచ్చుకొని, పన్నులు గ్రామ ప్రగతికి పునాదులు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి” అన్నారు. పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ ఉన్నారు.
ఆవ ఛానెల్ పరిశీలన
రాజవోలు గ్రామపంచాయతీ నుంచి తిరిగి వస్తూ పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కీలకమైన ఆవాఎల్ చానల్ ను పరిశీలించారు. ఎస్టీపీ నుంచి వచ్చే ఈ ఛానెల్ పూర్తిగా వ్యర్ధాలతో నిండిపోయి ఉండటంపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ లను పిలిచి కాలువలో వ్యర్ధాలు పేరుకుపోకుండా, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు నిలిచిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీల్లో స్వచ్ఛరథాలు మాదిరిగా అర్బన్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎందుకు పేరుకు పోతున్నాయనే విషయం మీదా, ఆ సమస్య మీద ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. దీనికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందుతుందని, వెంటనే ఛానల్ సరిదిద్దే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
– గోదావరి పరీవాహకంలో కాలుష్య నివారణకు రూ.100 కోట్లు
కృష్ణా, గోదావరి నదులను కాలుష్యం నుంచి రక్షించడానికి, వాటిని శుభ్రపరచడానికి మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు చేపట్టారు. అయితే అనుకున్నంత స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని గుర్తించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నదీ జలాలు కాలుష్యం బారిన పడకుండా రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నిధుల ద్వారా మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా కాలువల్లో కలకవకుండా నిరోధించడానికి ఉపయోగిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నది, కాలువల్లోకి వెళ్లే మురికినీటిని శుద్ధి చేయడానికి ఎస్టీపీలను ఏర్పాటు చేయడం వంటి పనులను ఈ నిధులతో చేపట్టాలని నిర్ణయించారు.
వుడ్ బ్యాంక్ కోసం పంచాయతీరాజ్ – అటవీ శాఖ మధ్య అవగాహన ఒప్పందం
వుడ్ బ్యాంక్ కింద మొక్కలు కొనుగోలు చేయడానికి పంచాయతీరాజ్ – అటవీ శాఖల అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్లను పంచాయతీరాజ్ శాఖ వారు అటవీ శాఖకు ఇస్తారు. అందుకు సంబంధించి అటవీ శాఖ కలపను త్వరగా ఇచ్చే మొక్కలను అందిస్తుంది. వాటితో పంచాయితీల్లో పల్లె వనాలు అభివృద్ధి చేస్తారు. అక్కడ వచ్చే కలపను అటవీ శాఖ కొనుగోలు చేసి వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా అటు పంచాయతీలకు ఆదాయ ఆర్జన సాధ్యమవుతుంది, ఇటు పర్యావరణం మెరుగవుతుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పీసీసీఎఫ్ చలపతి రావు, పి ఆర్ ఆర్డీ కమిషనర్ కృష్ణ తేజ సంతకాలు చేశారు.
Prajavartha Online Telugu News