Breaking News

గోదావరి గలగల కాదు… కాలుష్యంతో విలవిల

-రోడ్లు కంటే ముందు గోదావరి జలాల శుద్ధి జరగాలి
-నదిని మురికిగా ఉంచి భక్తులను స్నానాలు చేయమనడం వంచించడమే
-పారిశ్రామికవేత్తల మాటల్లో నియమాలు… చేతల్లో ఉల్లంఘనలు
-ఆంధ్ర పేపర్ మిల్లు సంస్థ నిబంధనలను ఉల్లంఘించింది
-కనీసం పన్ను బకాయిలు కూడా చెల్లించలేదు
-పర్యావరణ పరిరక్షణలో పారిశ్రామికవేత్తలు బాధ్యతతో ఉండాలి
-రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘ఒకప్పుడు గలగలా ప్రవహించిన గోదావరి తల్లి, నేడు పారిశ్రామిక వ్యర్థాల కాలుష్యంతో విలవిలలాడుతోంది. నదిని మురికిగా ఉంచి, భక్తులను పవిత్ర స్నానాలు చేయమనడం ప్రజలను వంచించడమే అవుతుంది. ఇంత కలుషిత నీటిలో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ, జబ్బులు రావడం మాత్రం ఖాయమ’ని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం రోడ్లు, రంగులు వేయడం కంటే ముందు గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించాలని అధికారులకి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు.
ఈ సమావేశానికి ముందు తూర్పు లంక లాగూన్స్ పరిశీలించారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ నల్లా ఛానెల్ ను మరోసారి పరిశీలించారు. కన్వేయర్ బెల్ట్ మీద మురుగు నీరు శుద్ధి ప్రక్రియ ముందుకు వెళ్లకపోవడం గుర్తించారు. దీనిపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు.
అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “ఒక వైపు పుణ్య నది గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులకు చెబుతూ.. మరో వైపు భారీ స్థాయిలో మురుగు నీటిని నేరుగా నదిలోకి వదలడం అత్యంత హాస్యాస్పదం, దారుణం. స్నానం చేస్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదుగానీ… జబ్బులు వచ్చే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. రాజమండ్రి నగరం నుంచి ప్రతి రోజూ 75 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుంటే, అందులో కేవలం 30 మిలియన్ లీటర్లను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగిలిన 45 మిలియన్ లీటర్ల మురికినీటిని ఎటువంటి శుద్ధి లేకుండానే నేరుగా గోదావరి నదిలోకి వదిలేస్తున్నారు. గోదావరి తల్లి మన తప్పులన్నింటినీ భరిస్తూ ప్రవహిస్తోంది కాబట్టి సరిపోయింది. కానీ పవిత్రమైన పుష్కర స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావన కలగకూడదు.
మురుగునీటి శుద్ధికి బడ్జెట్ ఎక్కడ?
రాబోయే పుష్కరాల కోసం అన్ని రకాల వసతులు, రోడ్లు, ఘాట్‌ల నిర్మాణం, మౌలిక వసతులు కోసం దాదాపు రూ.8,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేసుకున్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం కానీ, వారు స్నానం చేసే గోదావరి నదిని శుభ్రంగా ఉంచే మురుగునీటి శుద్ధికి మాత్రం పైసా బడ్జెట్ కేటాయించలేదు. రోజూ 45 ఎంఎల్డీ మురుగునీరు నేరుగా నదిలోకి వెళ్తుంటే.. దాన్ని ఆపడానికి బడ్జెట్ పెట్టకుండా, మిగతా వసతులకు రూ. 8,000 కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం?
కొన్నేళ్ల క్రితం ఏలూరులో తాగునీరు కలుషితమై, ప్రజలు వింత వ్యాధి బారిన పడి పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి. గోదావరి నదిలోకి మురుగు నీరు కలవకుండా నిరోధించేందుకు, అత్యుత్తమ టెక్నాలజీతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలి.
వాళ్లది బాధ్యత లేని నిర్లక్ష్యం
నిన్న జరిగిన సమావేశంలో పారిశ్రామికవేత్తలు తాము అన్ని నిబంధనలూ కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పారు. కానీ ఈ రోజు ఆంధ్ర పేపర్ మిల్లు పరిసరాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే వారు చెప్పిన మాటలకు, అక్కడ ఉన్న పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. పరిశ్రమ నుంచి వస్తున్న రసాయన వ్యర్థ జలాల కోసం కనీసం ఒక కాంక్రీట్ కెనాల్ కూడా నిర్మించలేదు. విషపు నీటిని నేరుగా వదిలేయడం వల్ల చుట్టుపక్కల భూగర్భజలాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. ఈ రసాయన మురికి నీరంతా నేరుగా పవిత్ర గోదావరిలో కలవడం వల్ల నదిలో విపరీతంగా గుర్రపుడెక్క పెరిగిపోతోంది. నది పర్యావరణ వ్యవస్థ సర్వనాశనమవుతోంది. ఇన్ని తప్పులు చేస్తూ, తిరిగి మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు అని ఆ పరిశ్రమ వాళ్ళు మాట్లాడుతున్నారు.
కోట్లు అర్జిస్తున్నా… రూ. 13 కోట్ల టాక్స్ కట్టలేదు
ఆంధ్రా పేపర్ మిల్లు సంస్థ రూ.500 కోట్ల భారీ లాభాలు గడిస్తున్నా, ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.13 కోట్ల పన్ను బకాయిలను మాత్రం చెల్లించడం లేదు. క్షేత్రస్థాయిలో ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా, కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఆ యాజమాన్యానికి కనీసం ఒక్క నోటీసు కూడా పంపించలేదు. పన్ను బకాయిలు ఎందుకు కట్టలేదని, కాలుష్యాన్ని ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నిస్తే.. తాము 3 వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని యాజమాన్యం సాకులు చెప్పడం సరికాదు. ఫ్యాక్టరీ నడపడానికి మన గోదావరి జలాలను వాళ్లు వాడుకుంటున్నారు కనుకే ఉపాధి కల్పిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రజలందరి ప్రాథమిక హక్కు. ఉద్యోగాలు ఇస్తున్నామనే సాకుతో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. కాలుష్యంపై గట్టిగా నిలదీస్తే రాష్ట్రం వదిలి వెళ్లిపోతాం అని కొందరు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు మేము లొంగేవాళ్లం కాదు. పారిశ్రామికవేత్తల మీద మాకు తగిన గౌరవం ఉంది. ఉద్యోగాలు ఇస్తున్నారనే మిమ్మల్ని గౌరవిస్తున్నాం. కానీ పర్యావరణాన్ని రక్షించడం మీ ప్రాథమిక బాధ్యత . దయ చేసి ఆ బాధ్యతను గుర్తించి నడుచుకోవాలి.
రూ. 1368 కోట్లు మంజూరు చేశాం
గోదావరి పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఈ రెండేళ్లలో 1849 కిలోమీటర్ల బీటీ రోడ్లు రూ. 1368 కోట్లతో మంజూరు చేశాం. అందులో 229 కిలోమీటర్ల బీటీ రోడ్లు పూర్తయ్యాయి. 190 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 600 కిలోమీటర్లు సాస్కీ పథకం ద్వారా మంజూరు చేశాం. 2076 కిలోమీటర్ల సీసీ రోడ్లు రూ.1038కోట్లతో మంజూరు చేశాం. అందులో 1340 కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి. 684 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. అడవి తల్లి బాట కింద మరో 216 కిలోమీటర్ల బీటీ రోడ్లు రూ.180 కోట్లతో మంజూరు చేశాం. అందులో 95 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. 42 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా టైమ్ లైన్ పెట్టుకొని పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను కోరుతున్నాను. ఇవి కాకుండా ఇంకా 1324 కీలోమీటర్ల బీటీ రోడ్లుకు రూ.989 కోట్లు కావాలని అధికారులు కోరారు. ఇందులో 480 కిలోమీటర్లు బీటీ రోడ్లు ప్రాధాన్యత ఆధారంగా కావాలని కోరారు. వీటిని కూడా ఒకసారి పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటాం.
అధికారులతో సమీక్షలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
రాబోయే పవిత్ర గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఆరు జిల్లాల్లో దాదాపు రూ.8,800 కోట్లు నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. పుష్కర జిల్లాల పరిధిలో రూ.1,080 కోట్ల అంచనా వ్యయంతో 1,324 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి 889 పనులను ప్రతిపాదించారు. కనెక్టివిటీని పెంచేందుకు రూ. 975 కోట్ల వ్యయంతో 850 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ పనులను అంచనా వేశారు. జనసందోహం అంతా కేవలం రాజమండ్రి నగరానికే పరిమితం కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలకు వికేంద్రీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. అలాగే పుష్కర్ నగర్ అంచనా నమూనాను తయారు చేయాలని, పుష్కర్ నగరలతో పాటు పుష్కర్ పంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఒక పంచాయతీలో పైలైట్ ప్రాజెక్ట్ గా చేపట్టాలని నిర్ణయించారు. లాడ్జింగ్, బోర్డింగ్, పార్కింగ్, శానిటేషన్ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, పంచాయతీ రాజ్ కమిషనర్‌ కృష్ణతేజ, కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *