Breaking News

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై కొత్త వ్యూహం

-దేవరపల్లి మండలం యడవోలు వద్ద కోకో సిటీ
-జూలైలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన
-పులివెందులలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పూర్తికి నిధుల మంజూరు
-కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ వర్తింపు
-మత్స్యకారులకు 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు ఆమోదం
-వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు పండించిన ఉత్పత్తులు నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చేలా ఫార్మ్ టూ హోమ్ విధానం అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రత్యేకించి కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు నేరుగా వినియోగదారుకు చేర్చేలా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సహా తక్కువ వ్యయంతో ఇంటి వద్దకే చేరేలా ఈ కొత్త వ్యూహం ఉపయోగపడుతుందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖలు, ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసారి రాష్ట్రంపై ఎల్ నినో చూపుతున్న ప్రభావాలను అంచనా వేస్తూ ప్రాంతాల వారీగా పంటల సాగు అంచనా జరగాలని, దానికి అనుగుణంగానే చర్యలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పీఎండీఎస్- హాఫ్ మూన్ విధానాల్లో సేద్యం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్ నినో కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని రైతులు నష్ట పోకుండా పంటలకు కనీస మద్ధతు ధర లభించేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో కేంద్ర సహకారం కూడా తీసుకుని ఏపీలో చేపడుతున్న ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సాగుతో విజయవంతమైన రైతుల సేవల్ని కూడా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. కరవు ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు చోట్ల పశువుల దాణా పండించేలా చూడాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణతో పాటు ఆధునీకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు చేసి ఏ పంటకు భూములు అనువుగా ఉన్నాయన్నది రైతులకు తెలియచేయాలన్నారు. భూసార పరీక్షలు చేసి వాటి వివరాలను రైతులు పొందేలా ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రకృతి సేద్యం సహా ఎన్ఎంఎన్ఎఫ్ పథకం అమలు కోసం కేంద్రానికి లేఖలు రాయాలని సీఎం నిర్దేశించారు. రైతు బజార్లు, ప్రైవేటు మార్కెట్లలో ప్రకృతి సేద్యం ద్వారా పండిన ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అరటికి కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం

కృష్ణా, గోదావరి డెల్టా సహా వివిధ ప్రాంతాల్లో పంటలకు సాగునీటిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పంట తెగుళ్లను నియంత్రించేలా పురుగుమందుల వినియోగం ఏమేరకు రాష్ట్రంలో తగ్గించగలిగామో అంచనా వేయాలని సీఎం స్పష్టం చేశారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి మైక్రో న్యూట్రియంట్లను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. యుద్ధ ప్రభావం నేపథ్యంలో రసాయన ఎరువుల లభ్యత పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ప్రకృతి సేద్యం వైపుగా రైతుల్ని ప్రోత్సహించాలన్నారు. నేచురల్ ఫార్మింగ్ పై వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రోఫెసర్లు, విద్యార్ధులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి అధ్యయనం చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ పై క్లస్టర్ల వారీగా ప్రణాళికలు చేపట్టటంతో పాటు రైతు సాధికార సంస్థ ద్వారా హార్వెస్టర్లు, విత్తన యంత్రాలు, ఇతర పరికరాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫార్మర్ యాప్ ద్వారా అన్ని అంశాలనూ ఇంటిగ్రేట్ చేయాలని డ్రోన్లు, ఫార్మింగ్ యంత్రాల వినియోగం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా మార్చేందుకు రూ.40 వేల కోట్లతో పూర్వోదయ పథకం అమలులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల కనెక్టివిటీ, గోదాములు సహా మౌలిక సదుపాయాల నిర్మాణంతో పాటు రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో అభివృద్ధి చేయనున్నట్టు సీఎం వివరించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి సమీపంలో యడవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. జూలై నాటికి మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. పశు దాణాతో పాటు సైలేజ్ ను తక్కువ వ్యయానికే అందుబాటులోకి తేవటంతో పాటు తీవ్ర ఉష్ణోగ్రత కారణంగా పౌల్ట్రీలో కోళ్లు చనిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాయలసీమలో అరటికి కోల్డ్ స్టోరేజి సౌకర్యం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

బ్లూ ఎకానమీగా ఆక్వారంగం ఆభివృద్ధి

పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.3 కోట్లను తక్షణమే విడుదల చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం నిర్దేశించారు. ఆక్వా జోన్లలో ఆక్వా సాగు చేసే రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సీడీ అంశంపైనా ముఖ్యమంత్రి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.1.50 చొప్పున విద్యుత్ విద్యుత్ సబ్సీడి ఇస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఇచ్చిన 50 వేల కనెక్షన్లతో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకూ ఈ సబ్సిడీ వర్తింప చేయాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,100 కోట్ల ఇస్తోందని తెలిపారు. కొత్తగా ఇచ్చే కనెక్షన్లకు కూడా రూ.188 కోట్ల అదనపు సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని వివరించారు. రాష్ట్రంలో సాగవుతున్న 4 లక్షల ఎకరాలు ఆక్వా జోన్ పరిధిలోకి రావాలని సీఎం స్పష్టం చేశారు. ఆక్వా రంగంలో క్వాలిటీ సర్టిఫికేషన్‌తో పాటు ట్రేసబిలిటీ తీసుకురావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లోనూ చేపల పెంపకం ద్వారా స్థానిక మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. అలాగే సముద్ర తీరంలో మత్స్యకారులకు 200 మెకనైజ్డ్ బోట్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. దీని కోసం రూ.240 కోట్ల మేర వ్యయం అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. బ్లూ ఎకానమీ దిశగా ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు బజార్లను ఆధునికంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 90 నియోజకవర్గాల్లో రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. డిజి రైతు బజార్ యాప్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖల అధికారులు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *