Breaking News

ఎన్‌సీసీ క్రమశిక్షణే సేవా భావానికి బాట

– ఉద్యోగ సంఘ నాయకత్వానికి ఎన్‌సీసీ అనుభవం ఎంతో దోహదం
– ఎన్‌సీసీ శిక్షణ అధికారి (రాష్ట్ర) గా బాధ్యతలు స్వీకరించిన ఎ.విద్యాసాగర్

తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌సీసీతో అనుబంధం ద్వారా నేర్చుకున్న సమయపాలన, బాధ్యతాయుత వైఖరి, సమన్వయ నైపుణ్యాలు ఉద్యోగ సంఘ నాయకుడిగా తన ప్రయాణంలో ఎంతో ఉపయోగపడ్డాయని ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్య‌క్షులు ఎ.విద్యాసాగ‌ర్ అన్నారు. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలు కనుగొనడంలో ఎన్‌సీసీ శిక్షణ ప్రత్యేకమైన దృక్పథాన్ని ఇచ్చిందన్నారు.
బుధ‌వారం తిరుప‌తిలోని ఎస్‌వీ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌- 11 ఆంధ్రా ఎయిర్ స్క్వాడ్ర‌న్ ఎన్‌సీసీ కార్యాల‌యం వ‌ద్ద విద్యాసాగ‌ర్‌.. ఎన్‌సీసీ శిక్ష‌ణ అధికారి గా ప‌దోన్న‌తి పొంది బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించడంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, నాయకత్వ లక్షణాల పెంపుకు ఎన్‌సీసీ ఒక ఉత్తమ వేదికగా నిలుస్తోందన్నారు. ఎన్‌సీసీ ద్వారా విద్యార్థుల్లో సమయపాలన, బాధ్యత, ఆత్మవిశ్వాసం వంటి గుణాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. పరేడ్‌లు, శిక్షణా శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా యువత సమాజానికి సేవ చేయాలనే భావన పెంపొందుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు, రక్తదాన శిబిరాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ వంటి సేవా కార్యక్రమాల్లో ఎన్‌సీసీ కేడెట్లు చురుకుగా పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. రక్షణ దళాలు, పోలీసు శాఖలు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎన్‌సీసీ సర్టిఫికెట్లకు ప్రాధాన్యత లభించడం విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తోందన్నారు.

దేశానికి బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ సేవలు విశేషమని.. ఇలాంటి ఎన్‌సీసీకి రాష్ట్ర శిక్ష‌ణ అధికారిగా ప‌దోన్న‌తి ల‌భించ‌డం చాలా ఆనందంగా, గ‌ర్వకార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

సంఘటిత శక్తి, సేవా భావం, క్రమశిక్షణ — ఈ మూడు విలువలు ఎన్‌సీసీతో అనుబంధం ద్వారా అలవడినవేనని, అదే స్ఫూర్తితో ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. రాష్ట్ర శిక్షణ అధికారిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని, ఎన్‌సీసీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తానని ఎ.విద్యాసాగర్ తెలిపారు. 1987లో జూనియ‌ర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాన‌ని.. రెండుసార్లు జాతీయ‌స్థాయిలో ఉత్త‌మ ఉద్యోగి అవార్డు సాధించాన‌ని.. డీజీఎన్‌సీసీ క‌మెండేష‌న్ కూడా పొందిన‌ట్లు తెలిపారు. మూడు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ క్యాంపులు, అయిదు ఆలిండియా వాయుసైనిక్ శిబిరాల్లో పాల్గొన్న‌ట్లు పేర్కొన్నారు. 100కు పైగా జాతీయ‌, రాష్ట్ర‌స్థాయి ఎన్‌సీసీ శిబిరాల్లో పాల్గొన్న‌ట్లు వివ‌రించారు.
ఈ కార్య‌క్ర‌మంలో 11 (ఏ) ఎయిర్ స్క్వాడ్ర‌న్ (టీ) ఎన్‌సీసీ, తిరుప‌తి గ్రూప్ కెప్టెన్ రాజ‌గోపాల్ జ‌గ‌దీష్ ఆత్రే, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ షేక్ ష‌రీఫ్‌, సూప‌రింటెండెంట్ జి.శంక‌ర్‌, ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ ర‌మ‌ణ‌, గుంటూరు జిల్లా అధ్యక్షులు జి.శ్రీనివాసరావు, కడప జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాసరావు, చిత్తూరు జిల్లా అధ్య‌క్షులు వి.రాఘవులు, తిరుపతి జిల్లా అధ్యక్షులు సీహెచ్ సురేష్, తిరుపతి నగరశాఖ అధ్యక్షులు పి.లలిత్ కుమార్, విజయవాడ నగర శాఖ అధ్యక్షులు సీహెచ్ సీవీఆర్ ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *