విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు రోడ్డులోని విజయ్ కృష్ణ సూపర్ బజార్ పక్కన ఉన్న డా॥ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో బుధవారం రూ.3 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయుర్వేద విద్యాసంస్థలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
గతంలో 2014–2019 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయుర్వేద విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ఆయుర్వేద కళాశాలలో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి పీజీ విద్యను అభ్యసిస్తున్నారన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆయుష్ శాఖ కారణంగా గత పదిహేనేళ్లుగా ప్రజల్లో ఆయుర్వేదంపై అవగాహన, విశ్వాసం మరింత పెరిగిందన్నారు. నేచురల్ ట్రీట్మెంట్స్‌కు ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు భవనాల విస్తరణ, ఆధునిక పరికరాల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు అవసరమని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు 30 పీజీ సీట్లను 60 సీట్లకు పెంచినట్లు తెలిపారు. అలాగే కాలేజీ అభివృద్ధి కోసం స్థలం కేటాయింపు, కొత్త భవనాల నిర్మాణం వంటి చర్యలు చేపట్టినట్లు…ఈ కాలేజీకి ప్రతిరోజూ అనేక మంది రోగులు, విద్యార్థులు వస్తుండటంతో రాష్ట్ర స్థాయిలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రస్తుతం రూ.3 కోట్ల వ్యయంతో అదనపు భవనాలు, వసతుల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ప్రతిష్టాత్మక కాలేజీ ఉండటం గర్వకారణమని పేర్కొంటూ, ఇక్కడ చదివే విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం తరఫున, స్థానిక శాసనసభ్యుడిగా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాలేజీ సిబ్బంది కూడా ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రశంసిస్తూ, కాలేజీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. రూ.3 కోట్ల అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి కాలేజీకి అందజేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, చింతా దుర్గారావు, బుల్లయ్య, ఆస్పత్రి యాజమాన్యం, మెడికల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News