-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఏర్పాటు అంశంపై మెప్మా వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎంఎస్‌వానిధి పథకం కింద పర్యాటక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాధాన్యత గల ప్రాంతాలలో స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై తన ప్రతిపాదన తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అధిక జనసంచారం, పర్యాటక రద్దీ ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారని, స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ద్వారా వీధి వ్యాపారులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార విక్రయ కేంద్రాలను అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు.
ఫుడ్ హబ్స్‌లో మహిళలు, పురుషులకు ప్రత్యేక మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్ మరియు లైటింగ్, పార్కింగ్, అగ్నిమాపక భద్రత, సీసీ కెమెరా నిఘా వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాలు పాటించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News