Breaking News

ఆసుపత్రుల పనితీరు మెరుగుపడకుంటే చర్యలు తప్పవు

-ఐవీఆర్ఎస్ ఫలితాల ఆధారంగా పనితీరులో అట్టడుగున ఉన్న ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లతో ప్రత్యేక సదస్సులు
-ప్రైమరీ, సెకండరీ, టీచింగ్ ఆసుపత్రుల వారీగా
-జిల్లాల నుంచి తరలివచ్చిన అధికారులు
-సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రోగులకు వైద్య సేవలు అందించడంలో వెనుకబడిన ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఆసుపత్రుల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా రోగుల నుంచి సేకరించిన సేవల సంతృప్తి (పబ్లిక్ పర్సప్షన్) స్థాయి అనుసరించి పనితీరులో వెనుకబడినట్లు గుర్తించిన సామాజిక, పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, మెడికల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు, సదరు జిల్లాల వైద్య ఆరోగశాఖ, అధికారులను బుధవారం అమరావతికి పిలించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని 11 బోధన, ప్రత్యేక ఆసుపత్రుల సూపరింటెండెంట్లు కూడా విజయవాడకు వచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు అనుసరించి పనితీరుపరంగా వెనుకబడిన ఆసుపత్రుల వారితో సదరు హెచ్ఓడీ కార్యాలయాల ఆధ్వర్యంలో విడివిడిగా వర్క్ షాపు లు బుధవారం నిర్వహించారు. ఆసుపత్రుల పనితీరు మెరుగుపరిచేందుకు వీలుగా ఈ తరహా కార్యక్రమాలు జరపడం ఇదే తొలిసారి. పనితీరు మెరుగ్గా లేని వైద్యులు, సూపరింటెండెంట్లకు సదరు విభాగాధిపతుల కార్యాలయాలు సంజాయిషీ నోటీసులు జారీచేశాయి. వీటిపై విభాగాధిపతులు(HoDs) వివరణలు తీసుకున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడo, విధుల నిర్వహణలో నిర్లిప్తత, పారిశుద్ధ్యం, ఇతర అంశాల్లో ఆసుపత్రుల పనితీరును సమీక్షించారు. ఈ వర్క్ షాప్ ల నిర్వహణకు ముందు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా సమావేశమై విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించొద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.

ఐవీఆర్ఎస్ ఫలితాల్లో 95% విశ్వసనీయత

గత నెల 25 నుంచి మే 25 మధ్య ఆసుపత్రులకు వచ్చిన రోగుల నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన అభిప్రాయాల అనుసరించి, వెనుకబడి న (అట్టడుగు నుంచి) 20 ప్రాథమిక , పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సదరు జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళగిరిలోని ఓ హోటల్ లో ప్రత్యేక సదస్సును ప్రజారోగ్య శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్
మాట్లాడుతూ విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఇకపై ఉపేక్షించేదిలేదని, సీఎం, మంత్రి ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారన్నారు. అసంతృప్తి స్థాయిలో 81.25% నుంచి దిగువకు 52.86% మధ్య పనితీరు కనబరిచిన ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్ల నుంచి వీరపాండియన్ వివరణ కోరారు. ఆసుపత్రులకు వచ్చి చికిత్స పొందిన వారి నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన సమాచారంలో 95% వరకు విశ్వసనీయత ఉందని, అన్ని ప్రభుత్వ శాఖలు దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రాలకు దూర ప్రాంతాల నుంచి విధులకు హాజరవుతుండడం వంటి సంఘటనలు కమిషనర్ దృష్టికి వచ్చాయి. పనితీరులో ఇకపై మార్పు రాకుండా ఉంటే చర్యలు తప్పవని పునరుద్ఘాటించారు. అలాగే వరుసగా రెండు, మూడు సార్లు చొప్పున పనితీరులో వెనుకబడిన ప్రాధమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు హెచ్చరికలు జారీచేశారు. ఈ కేటగిరిలో సుమారు 30 మంది వైద్యులు హాజరయ్యారు. ఇదే సమయంలో సంతృప్తి స్థాయి 100% ఉన్న 30 మంది వైద్యులను కూడా ఈ సదస్సుకు పిలిచారు. వీరిలో పలువురు రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరించారు. వీరిని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, వీరి అనుభవాన్ని సహచర వైద్యులు గమనించి, పనితీరు మెరుగుపరుచుకోవాలని స్పష్టంచేశారు. ఈ సదస్సుకు 26 జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హాజరుకావడం గమనార్హం. ఆసుపత్రుల పనితీరులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని కమిషనర్ వీరపాఃడియన్ పేర్కొన్నారు.

10 జిల్లాల్లోని సెకండరీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో

డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా 10 జిల్లాల్లో పనితీరులో బాగా వెనుకబడిన ఆసుపత్రుల్లో అట్టడుగుస్థాయి నుంచి 20 ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సదరు జిల్లా అధికారులతో కుంచనపల్లిలోని ప్రధాన కార్యాలయంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆసుపత్రుల వారీగా పనితీరు సమీక్షించి, ఇకపై పనితీరు మెరుగుపడకుండా ఉంటే మాత్రం సహించేదిలేదని వెల్లడించారు. ఇదే సమయంలో ఇతర జిల్లాల అధికారులు ‘వర్చువల్’గా సమావేశంలో పాల్గొన్నారు.

డీఎంఈ పరిధిలో .

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో కర్నూలు, అనంతపురం, కడప, ఆదోని, ఒంగోలు, శ్రీకాకుళం జీజీహెచ్ ల సూపరింటెండెంట్లు, పలాసి కిడ్నీ రీసెర్చి సెంటర్, తిరుపతి జీజీహెచ్, విశాఖలోని రీజినల్ ఐ హాస్పిటల్, గుంటూరులోని చెస్ట్ హాస్పిటల్, తిరుపతిలోని మెటర్నటీ హాస్పిటల్ సూపరింటెండెంట్లు విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సుకు హాజరయ్యారు. డీఎంఈ డాక్టర్ రఘునందన్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ రాధికారెడ్డి ఆసుపత్రుల వారీగా పనితీరు సమీక్షించారు. ప్రస్తుతం గుర్తించిన సమస్యల పరిష్కారానికి తీసుకోబోతున్న చర్యల గురించి వారి నుంచి తెలుసుకున్నారు. త్వరగా పరిస్థితుల్లో మార్పు రావాలని వారు స్పష్టంచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *