-జిల్లాలో పారదర్శకంగా ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రక్రియ
-క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనగణన–2027 ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్) కార్యక్రమం అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. దేశ ప్రగతికి, సమగ్ర ప్రణాళికా రూపకల్పనకు జనగణన గణాంకాలు కీలక పునాదిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
గురువారం విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లిలో కొనసాగుతున్న ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియను కలెక్టర్ డా. జి.లక్ష్మీశ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లే సమయంలో ప్రజలు సరైన, పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత కచ్చితత్వంతో, దోషరహితంగా డేటాను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జనగణన ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.
జనగణన ద్వారా సేకరించే గణాంకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం తదితర రంగాల్లో భవిష్యత్ కార్యాచరణకు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ వివరించారు.
జనగణనలో ప్రతి సమాచారం విలువైనదని, ప్రజల సహకారంతోనే సమగ్ర గణాంకాలు సిద్ధమవుతాయని తెలిపారు. ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది నిబద్ధతతో పనిచేసి నాణ్యమైన డేటా సేకరణకు కృషి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు స్పెషల్ డ్రైవ్ ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హౌస్ లిస్టింగ్ , హౌసింగ్ సెన్సస్ ముగింపు దశలో ఉన్నందున కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు.
Prajavartha Online Telugu News