-క్రీడా రంగంలో నూతన సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహం
-క్రీడాకారుల అభివృద్ధికి ఆధునిక సాంకేతికత అవసరం…మంత్రి
-స్వదేశీ సాంకేతికతో తయారు చేసిన డెక్స్‌పాడ్స్ పరికరాన్ని ఆవిష్కరించిన మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న బాట్‌ఫోర్జ్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ క్రీడాకారుల కోసం అభివృద్ధి చేసిన డెక్స్‌పాడ్స్ పరికరాన్ని రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సచివాలయంలోనీ తన చాంబర్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంస్థ చీఫ్ సేల్స్ ఆఫీసర్ శీలం శ్రీహర్ష మాట్లాడుతూ, రియాక్షన్ ట్రాకింగ్, స్పోర్ట్స్ పనితీరు అంచనా, శాస్త్రీయ శిక్షణ విధానాలు, ప్రతిభ గుర్తింపు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధిలో డెక్స్‌పాడ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతికతతో ఈ పరికరాన్ని రూపొందించినట్లు, దేశంలోనే ఈ తరహా వినూత్న క్రీడా సాంకేతిక పరికరాల్లో ఇది ప్రత్యేకమైనదని మంత్రి గారికి తెలిపారు. క్రీడాకారులు, కోచ్‌లు, స్పోర్ట్స్ అకాడమీలు, విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రతినిధులు పేర్కొన్నారు.
క్రీడా అభివృద్ధికి దోహదపడే వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలను ప్రభుత్వం ప్రోత్సహించే దిశగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సీఈఓ రాజేష్, సిటివో చైతన్య, సిఓఓ సెల్వేందర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News