విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ప్రగతి, రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా విజయవాడలోని బెరమ్ పార్క్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. APTDC చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ బలోపేతానికి, పర్యాటకులకు అందించే సేవల నాణ్యతను పెంచడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మెగా సమీక్షలో రాష్ట్రంలోని 7 డివిజన్ల డివిజనల్ మేనేజర్లు, 58 మంది యూనిట్ మేనేజర్లు మరియు ఇంజనీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అడుగులు
ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసి సంస్థ ప్రతిష్టను పెంచాలి. పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి వసతులు, మెరుగైన సేవలు అందించడమే మన మొదటి ప్రాధాన్యత కావాలన్నారు.
సమావేశంలోని ముఖ్య అంశాలు & ఆదేశాలు
ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట: సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగుల సంక్షేమానికి ఏపీటీడీసీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చైర్మన్ స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇస్తూ, ఇప్పటికే రూ.2 కోట్లకు పైగా వ్యయంతో ఉద్యోగుల సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు.
గడువులోగా పనులు పూర్తి కావాలి : ఇంజనీరింగ్ విభాగ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న టూరిజం ప్రాజెక్టులు మరియు అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా, ఎక్కడా నాణ్యత లోపించకుండా పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
పర్యాటకుల ఆకర్షణే ధ్యేయం: రాబోయే రోజుల్లో పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు, హోటళ్లు మరియు పర్యాటక ప్రాంతాలలో వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకురావాలని మేనేజర్లకు సూచించారు.
ఈ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో APTDC ఎండీ (ఇన్చార్జ్) శ్రీమతి A.A Lపద్మావతి, ప్రాజెక్ట్స్ ఈడీ మేక శేషగిరి, చీఫ్ ఇంజనీర్ రమణ, ఎస్.ఈ. బి. ఈశ్వరయ్య, జీఎం (హోటల్స్) హేమమాలిని, పార్థసారథి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News