-6 పిల్లర్స్ రెస్పాన్స్ టీమ్స్‌తో నేరాలకు అడ్డుకట్ట
-ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలి…సైబర్ పెట్రోలింగ్ జరగాలి
-సైబర్ మోసాలపై ఫిర్యాదు అందిన మరుక్షణమే వార్ రూంలో జీరో ఎఫ్ఐఆర్
-ఏపీలో సైబర్ నేరానికి పాల్పడితే… తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్‌కు కలగాలి
-ప్రజలు నష్టపోకుండా బ్యాంకులు సహకరించాలి
-సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సైబర్ నేరాల అడ్డుకట్టకు జీరో ఎఫ్ఐఆర్ విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. బాధితులు సైబర్ వార్ రూమ్‌కు ఫోన్ చేసిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా బ్యాంకులను అప్రమత్తం చేసి గోల్డెన్ అవర్ టైంను వినియోగించుకుని అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ కాకుండా చూడాలని సూచించారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు బ్యాంకులూ సహరించాలన్నారు. సైబర్ నేరాలపై అన్ని వర్గాల ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలని, అవగాహనా కార్యక్రమాలు పెంచాలని సీఎం సూచించారు. పోలీస్ పెట్రోలింగ్ తరహాలోనే సైబర్ పెట్రోలింగ్ జరగాలని, ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చూడాలని సీఎం సూచించారు. నేరం జరిగిన తరువాత ఫిర్యాదు రావడం, పోలీసులు విచారణ జరపడం కంటే…అసలు నేరమే జరిగే అవకాశం లేకుండా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని జరుగుతున్న నేరాల పట్ల వారికి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. 6 పిల్లర్ రెస్పాన్స్ టీమ్స్‌తో వివిధ రకాల సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తాము సిద్దం చేస్తున్న ప్రణాళికలను ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు.
28 జిల్లాల్లో సైబర్ యూనిట్లు… 4 రీజనల్ హబ్‌లు : డీజీపీ
ప్రజెంటేషన్‌పై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ…”సైబర్ నేరాలను అరికట్టేందుకు సిక్స్ పిల్లర్ వ్యవస్థలతో ఏపీ సైబర్ గార్డ్ అనే సమగ్ర సైబర్ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. 6 పిల్లర్ సైబర్ భద్రతా వ్యవస్థలో సైబర్ వార్ రూం, 1930 కాల్ సెంటర్ డాష్ బోర్డ్, టెక్నాలజీ&ఏఐ, కెపాసిటీ బిల్డింగ్, 3-టైర్ ఆర్కిటెక్చర్, ప్రజా చైతన్యం వంటి కార్యక్రమాలు చేపడతాం. 6 పిల్లర్స్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఒక సైబర్ వార్ రూంను ఏర్పాటు చేస్తున్నాం. దీని కోసం మంగళగిరిలోని ‘ప్రభల టెక్ పార్క్’లో ఇప్పటికే భవనాన్ని ఎంపిక చేశాం. ఈ సైబర్ వార్ రూంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్, సైబర్ థ్రెట్ ఇంటలిజెన్స్ అండ్ ఎనలటిక్స్, సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్, సైబర్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ రీసెర్చ్, లీగల్, పాలసీ అండ్ కంప్లైంట్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ వంటి మొత్తం 11 విభాగాలు పనిచేస్తాయి. రానున్న 30 రోజుల్లో ఆధునిక సదుపాయాలతో ఈ వార్ రూం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 1930 హెల్ప్ లైన్ కాల్ సెంటర్‌ను మరింత బలోపేతం చేస్తాం. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ (NCRP), 1930 హెల్ప్‌లైన్‌తో సమగ్ర డ్యాష్‌బోర్డ్ తీసుకువస్తున్నాం. ఫిర్యాదు వచ్చిన 10 నిమిషాల్లో బ్యాంకును సంప్రదించి నిందితుని అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ నేరాలపై టెక్నాలజీ & ఏఐ ఉపయోగించుకునేందుకు ఆర్బీఐ, ప్రముఖ బ్యాంకులతో కలిసి MuleHunter.AI అమలు దిశగా చర్యలు తీసుకువస్తున్నాం. కెపాసిటీ బిల్డింగ్‌లో భాగంగా ఏడాది కాలంలో 500 మంది పోలీసు అధికారులకు సైబర్ క్రైంపై ట్రైనింగ్ ఇస్తాం. 3 టైర్ ఆర్క్చిటెక్చర్ ద్వారా 28 జిల్లాల్లో సైబర్ యూనిట్లతో పాటు 4 చోట్ల రీజనల్ హబ్‌లను ఏర్పాటు చేస్తాం. వీటితో పాటు ప్రజలు సైబర్ క్రైం బారిన పడకుండా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఏడాదిలో 3 వేల కార్యక్రమాలు వివిధ స్థాయిల్లో, వివిధ రూపాల్లో చేపడతాం. ఏపీ సీఐడీ, ఏపీటీఎస్ బృందం న్యూఢిల్లీలోని ఇండియన్ సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్‌ను సందర్శించి అక్కడి వ్యవస్థలను అధ్యయనం చేసింది. అక్కడ అవలంభిస్తున్న పాలసీల ఆధారంగా రాష్ట్ర Cyber Fusion Centre రూపకల్పన చేపడుతున్నాం. టాప్ బ్యాంక్‌ల నోడల్ అధికారుల నియామకం, 30 నిమిషాల ఎస్‌ఎల్‌ఏ కోసం బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటాం. సీసీఎస్ పోలీస్ స్టేషన్లను ప్రత్యేక దర్యాప్తు యూనిట్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాము. ఈ విధంగా అన్ని చర్యలను తీసుకుని సైబర్ మోసాలకు, నేరాలకు అడ్డుకట్ట వేస్తాం” అని ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు.
డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి : సీఎం
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….”రాష్ట్రాన్ని సైబర్ నేరాల రహిత రాష్ట్రంగా మార్చాలి. దీని కోసం అన్ని బ్యాంకర్లు, పోలీసు విభాగం, ఏపీటీఎస్, ఆర్ధిక శాఖలు సమన్వయంతో పనిచేయాలి. నేరస్తులు కొత్త కొత్త పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నందున దానికి అనుగుణంగా పోలీసుల కౌంటర్ ప్లాన్ ఉండాలి. ముఖ్యంగా డిజిటల్ అరెస్టు విషయంలో విద్యావంతులు సైతం మోసపోతున్నారని… డిజిటల్ అరెస్టు లేదనే విషయాన్ని ప్రజల్లో నాటకుపోయేలా చేయాలి. డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టై తీరాలి. ఆ తరహాలో కఠిన చర్యలు ఉండాలి. ఏళ్ల తరబడి కష్టపడి ప్రజలు దాచుకున్న సొమ్ములను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో దోచుకుంటున్నారు. దీని వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. ఏపీ సైబర్ నేరాల నియంత్రణకు తీసుకునే చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి. సైబర్ నేరగాళ్ల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఏపీ ప్రజలను మోసం చేస్తే….తప్పించుకోలేం అనే హెచ్చరిక క్రిమినల్స్‌కు చేరాలి. ఆ స్థాయిలో భయం కల్పించేలా పోలీసు దర్యాప్తు, యాక్షన్ ఉండాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో జరిగిన సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News