-పారిశ్రామికవేత్తలు అందరూ కౌశలం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
-రాష్ట్రంలో ఎక్కడా జరగని రీతిలో పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి.. సలహాలు, సూచనలు స్వీకరణ
-పరిశ్రమల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుంది
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కానూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నైపుణ్య మానవ వనరుల కొరత ఒకటని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కౌశలం పోర్టల్ కార్యక్రమాన్ని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు.
ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు సచివాలయం శాఖల ఆధ్వర్యంలో శనివారం పెనమలూరు నియోజకవర్గం కానూరులోని వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఉపాధి కల్పన వేదిక “కౌశలం పోర్టల్” అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కౌశలం డైరెక్టర్ రవికుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై పరిశ్రమల్లో మానవ వనరుల అవసరాలు, ఎదురవుతున్న సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పారిశ్రామికవేత్తలతో జిల్లాలో నిర్వహించిన సమావేశాల్లో అత్యధికంగా వినిపించిన సమస్య నైపుణ్య మానవ వనరుల కొరతేనని పేర్కొన్నారు. స్థానికంగా కార్మికులు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యోగ మేళాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడానికి చాలా మంది ముందుకు రావడం లేదన్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రొఫెషనల్ విధానంలో “కౌశలం” కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. ప్రతి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ పరిధిలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను గుర్తించి, వారి విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులను సరిపోల్చి ఇంటర్వ్యూలకు పంపడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు.
జిల్లాలోని అనేక పరిశ్రమలు ఇంకా కౌశలం పోర్టల్‌లో నమోదు చేసుకోకపోవడం ఆందోళనకరమని, దీనికి ప్రధాన కారణం అవగాహన లోపమేనని కలెక్టర్ పేర్కొన్నారు. పరిశ్రమల యజమానులు తమ మానవ వనరుల అవసరాలను పోర్టల్‌లో నమోదు చేస్తే స్థానికంగానే తగిన సిబ్బందిని అందించే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా పరిశ్రమలకు వసతి, రవాణా వంటి అదనపు వ్యయాలు తగ్గడమే కాకుండా ఉద్యోగుల ఉత్పాదకత, ఉద్యోగ స్థిరత్వం కూడా పెరుగుతాయని చెప్పారు.
పరిశ్రమల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. “ముందుగా పరిశ్రమలను గ్రౌండ్ చేయండి… మీకు తోడుగా నేనుంటాను. ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అన్ని విధాల సహకారం అందిస్తోంది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఐదేళ్లుగా భూములు కేటాయించుకొని కూడా ప్రారంభం కాని పరిశ్రమ యూనిట్లకు నోటీసులు జారీ చేసి అవసరమైతే కేటాయింపులు రద్దు చేసే చర్యలు తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో నిరుద్యోగాన్ని తగ్గించి, స్థానిక యువతకు అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కౌశలం కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పారిశ్రామికవేత్తలు తమ సూచనలు, సలహాలు అందించాలని, జిల్లాలోని అన్ని పరిశ్రమలు తప్పనిసరిగా కౌశలం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కౌశలం ద్వారా స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు
ఎంప్లాయర్లు, ఉద్యోగార్థులకు వారధిగా కౌశలం ప్లాట్‌ఫారమ్
కౌశలం పోర్టల్ డైరెక్టర్ రవికుమార్
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “కౌశలం” కార్యక్రమం సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందని కౌశలం ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు.
ఉద్యోగాలను అందించే సంస్థలు ఒకవైపు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు మరోవైపు ఒకరినొకరు చేరుకోవడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కౌశలం వారధిగా పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14,006 సచివాలయాల ద్వారా ఉద్యోగార్థుల వివరాలను సేకరించి, వారి విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియలో నిర్వహించే అసెస్‌మెంట్ పరీక్షలు పాస్ లేదా ఫెయిల్ కోసం కాదని, అభ్యర్థులు అందించిన వివరాలను ధృవీకరించడానికేనని వివరించారు. దీని వల్ల ఎంప్లాయర్లకు విశ్వసనీయమైన సమాచారంతో కూడిన అభ్యర్థులు అందుబాటులోకి వస్తారని పేర్కొన్నారు.
డిసెంబర్ 2025 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది ఉద్యోగార్థులకు అసెస్‌మెంట్ నిర్వహించామని, ప్రతిరోజూ సుమారు 30 వేల మంది అభ్యర్థులకు షెడ్యూలింగ్ జరుగుతోందని తెలిపారు.
ఏ జిల్లాలో ఏ తరహా నైపుణ్యం కలిగిన యువత ఎక్కువగా ఉన్నారో గుర్తించి, వారికి అనుగుణంగా పరిశ్రమలు, సంస్థలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. మే నెలలో ప్రతిరోజూ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో నియామక ప్రక్రియలు నిర్వహించబడ్డాయని, దాదాపు 4వేల నుంచి 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగామని వెల్లడించారు.
ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్, హెటిరో డ్రగ్స్, టాటా ఎలక్ట్రానిక్స్, అపోలో టైర్స్ వంటి ప్రముఖ సంస్థలు కౌశలం ద్వారా నియామకాలు చేపడుతున్నాయని తెలిపారు.
స్థానిక యువతకు వారి స్వంత జిల్లాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రం వెలుపలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడం కౌశలం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు అందుబాటులోకి రావడంతో పాటు యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
కౌశలం గొప్ప పోర్టల్..
ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ.. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందించడంలో కౌశలం పోర్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు అవసరమైన అభ్యర్థులను వెరిఫైడ్, ట్రస్టెడ్ జాబ్ సీకర్స్ రూపంలో అందించాలని కోరారు. ఉద్యోగ అన్వేషకులు, ఉపాధి కల్పించే సంస్థల మధ్య వారధిగా ఈ పోర్టల్ పనిచేస్తోందని, ఇది గొప్ప వేదికగా అభివర్ణించారు.
పరిశ్రమల్లో కేవలం డిగ్రీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా చదివిన వారే కాకుండా పదో తరగతి కంటే తక్కువ చదువుకున్నవారు, నిరక్షరాస్యులు, సాధారణ కార్మికులు కూడా అవసరమవుతున్నారని పారిశ్రామికవేత్తలు తెలిపారు. అందువల్ల కనీస విద్యార్హతలు ఉన్నవారి వివరాలను కూడా కౌశలం పోర్టల్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్. వెంకట్రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కల్పన, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, గ్రామ-వార్డు సచివాలయాల జిల్లా అధికారి పద్మ, జిల్లా సమన్వయ అధికారి రవికాంత్, హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవికుమార్, వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పాండురంగారావు, పలు శాఖల అధికారులు, పలువురు పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, యువత పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News