గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వర్షాకాలంలో గుంటూరు నగరంలో గ్రీనరి అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థలోని ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు రానున్న వర్షాకాలంలో గ్రీనరి అభివృద్ధి మరియు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై వివిధ విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో గుంటూరు నగరంలో గ్రీనరీని అభివృద్ధి చేయడానికి పార్కులు మరియు సెంట్రల్ డివైడర్లలో మొక్కలను విరివిగా నాటాలని, పార్కులలో ఉన్న సిబ్బంది అందరికి విధులు కేటాయించాలని ఆదేశించారు. అలాగే అత్యవసర సమయాల్లో భారీ గాలులతో వర్షాలు కురిసే సమయాల్లో భారీ వృక్షాలు పడిపోయే సమయాల్లో నగర పాలక సంస్థ అధికారులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన సామగ్రిని బుధవారం నాటికి సిద్దం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక నగరంలో కూలడానికి సిద్దంగా ఉన్న శిధిలమైన వృక్షాలను గుర్తించడానికి అటవీ శాఖ మరియు నాగార్జున యునివర్సిటీ బోటనీ విభాగం అధ్యాపకుల సహకారం కోసం వారికి లేఖలు పంపాలన్నారు. అంతేకాక పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు సిబ్బంది నగరంలో శిధిలావస్తలో ఉన్న భవనాల జాబితాలను సిద్దం చేసి, సదరు భవనాలను ఖాళీ చేయుటకు యజమానులకు నోటీసులను అందజేయాలన్నారు. అలాగే నగరంలో ఉన్నహోర్డింగ్స్ పై ద్రుష్టి సారించి, హోర్డింగ్స్ యెక్క స్ట్రక్చరల్ స్టేబిలిటి సర్టిఫికేట్లను సచివాలయాల వారీగా కార్యదర్శులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో బహులంతస్తుల భవన నిర్మాణాలు జరిగే సమయాల్లో పిల్లర్లు నిర్మించడానికి గుంటలు తీసే సమయాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సదరు సమావేశంలో డిప్యూటి కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్, యస్.ఈ జి. వెంకటేశ్వర రావు, డి.సి.పి సూరజ్ కుమార్, ఏ.డి.హెచ్ శాంతి, ఈ.ఈ వేణు, డి.ఈ.ఈ, ఏ.ఈ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News