-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-P4 కార్యక్రమం కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాకుండా, సమిష్టి భాగస్వామ్యం మరియు సామాజిక బాధ్యత ద్వారా స్వయం సమృద్ధి కలిగిన కుటుంబాలను నిర్మించే ప్రజా ఉద్యమo: SAPF డైరెక్టర్ డా. సాంబశివ రాజు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.
శుక్రవారం ఉదయం స్థానక జిల్లా కలెక్టరేట్ లోని విసి హాల్ నందు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, స్వర్ణ ఆంధ్ర P4 ఫౌండేషన్ (SAPF) డైరెక్టర్ డా. వి. సాంబశివ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చెందిన PMU సభ్యులు హారికానాథ్, ఎం శ్రీనివాస్ లతో కలసి జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల సంఘాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో స్వర్ణ ఆంధ్ర P4 – జీరో పావర్టీ కార్యక్రమం అమలు మరియు భాగస్వామ్యాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర @2047” లో భాగంగా “జీరో పావర్టీ – P4” కార్యక్రమానికి వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పరచడం మరియు అవగాహన కల్పించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన బంగారు కుటుంబాల అవసరాలకు అనుగుణంగా భాగస్వామ్యాల ద్వారా వీరి జీవన స్థితిగతులను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. సమగ్ర అభివృద్ధి సాధనలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ భాగస్వామ్య సంస్థల సమిష్టి కృషి ఎంతో అవసరమని, స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనలో ఏ కుటుంబమూ వెనుకబడకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రైవేట్ రంగం మరియు సమాజ భాగస్వామ్యం కలిసి పనిచేస్తే పేదరిక నిర్మూలనతో పాటు స్థిరమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు మరియు ఫౌండేషన్లు తమ CSR కార్యక్రమాలను జిల్లా అభివృద్ధి ప్రాధాన్యంతో అనుసంధానం చేసి ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, మహిళా సాధికారత, శిశు సంక్షేమం, పర్యావరణం మరియు గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. పేదరిక రహిత మరియు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణ లక్ష్యానికి మద్దతుగా పాల్గొన్న అన్ని సంస్థలు మరియు ప్రతినిధులకు జిల్లా యంత్రాంగం తరపున కృతఙ్ఞతలు తెలిపారు.
SAPF డైరెక్టర్ డా. సాంబశివ రాజు గారు మాట్లాడుతూ, P4 కార్యక్రమం కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాకుండా, సమిష్టి భాగస్వామ్యం మరియు సామాజిక బాధ్యత ద్వారా స్వయం సమృద్ధి కలిగిన కుటుంబాలను నిర్మించే ప్రజా ఉద్యమమని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పరిపాలన మరియు SAPF అధికారులు P4 నమూనా యొక్క లక్ష్యం, అమలు విధానం మరియు కార్యాచరణపై సమగ్ర వివరాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ సంస్థలు జిల్లా పరిపాలన మరియు SAPFతో కలిసి P4 కార్యక్రమం కింద ప్రభావవంతమైన కార్యక్రమాల అమలుకు భాగస్వామ్యంతో తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పి. రాజశేఖర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ మదన్ మోహన్, జిల్లా పరిశ్రమల కేంద్రo జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, వివిధ కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు (PSUs), చారిటబుల్ ఫౌండేషన్లు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు సేవాభావం కలిగిన వ్యక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News