-తుని నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం: ప్రజావేదిక ద్వారా ప్రజలతో నేరుగా మమేకం
-ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సిద్ధం: తునిలో పండుగ వాతావరణం
-భద్రత, సౌకర్యాలపై అధికారులతో సమీక్షించిన ఎంపీ సానా సతీష్ బాబు
విజయవాడ/ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల జూన్ 1వ తేదీన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తుని మండలం చామవరం గ్రామంలో సీఎం పర్యటన కోసం యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా ‘ప్రజావేదిక’ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సాగనున్న ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా, చామవరం గ్రామంలో ఏర్పాటు చేయనున్న ‘ప్రజావేదిక’ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సీఎం ప్రత్యేక సమయాన్ని కేటాయించనున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనుండటంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్‌తో కలిసి శనివారం చామవరం గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేదిక నిర్మాణం, భారీ బహిరంగ సభకు వచ్చే ప్రజల కోసం కనీస సౌకర్యాలు (నీరు, నీడ, పార్కింగ్) యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, పోలీస్ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరారు. ముఖ్యమంత్రి రాకతో తుని నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. సీఎం పర్యటనలో భాగంగా పార్టీ క్యాడర్‌తో ప్రత్యేక సమావేశం కూడా ఉండటంతో, నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పర్యటనను విజయవంతం చేసే బాధ్యతను పార్టీ స్థానిక నాయకత్వం భుజాన వేసుకుంది. ఈ పర్యవేక్షణలో ఇంచార్జ్ ఎస్పీ రాహుల్ మీనా, జేసీ అపూర్వ భరత్, పెద్దాపురం ఆర్డీవో, డీఎస్పీ తిలక్, ఎస్‌బీ డీఎస్పీ సత్యనారాయణ, ఇంటెలిజెన్స్ డీఎస్పీ ఈశ్వరుడు తదితర రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, మండల పాక్స్ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News