Breaking News

ఆర్టీసీ ఆధునీకరణకు కీలక నిర్ణయాలు…రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖపట్నం నుంచి 40 ప్రత్యేక బస్సులు
-గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆర్టీసీని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టింది…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో బస్సుల ఆధునీకరణ, ఈవీ బస్సుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

గత ఐదేళ్లలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఆర్టీసీని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుని కొనసాగుతోందని తెలిపారు.

రాష్ట్రంలో దశలవారీగా ఈవీ బస్సుల విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని, తొలి దశలో 700 ఈవీ బస్సులు రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. జూలై నెలలో ఆరు డిపోలలో ఈవీ బస్సుల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం కానున్నాయని తెలిపారు.

తిరుపతికి ప్రత్యేకంగా 300 ఈవీ బస్సులు కేటాయించగా, మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఈవీ బస్సుల ఏర్పాటుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోందని చెప్పారు.

విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 40 ప్రత్యేక బస్సులను కేటాయించనున్నట్లు తెలిపారు. అలాగే గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి పేరున ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఆర్టీసీ అవినాభావ అనుబంధమని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో డిపోల ఆధునీకరణ చేపడతామని, కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే నైట్ ఔట్ అలవెన్స్ సహా ఉద్యోగుల పలు సమస్యలను పరిష్కరించినట్లు మంత్రి గుర్తుచేశారు. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఈవీ బస్సులతో ఏపీఎస్ఆర్టీసీకి మరింత కొత్త రూపు సంతరించుకుంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *