-గుంటూరు ఛానల్ విస్తరణకు భూములు ఇచ్చిన ఏడు గ్రామాల రైతుల ఖాతాల్లో జమ
-7 గ్రామాల రైతులకు రెండో దఫా చెల్లింపుగా రూ.17.58 కోట్ల విడుదల
-తొలి దఫా పరిహారంగా ఇప్పటికే రూ.10.54 కోట్లతో వెరసి రూ. 28.12 కోట్లు చెల్లింపు
-సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడుకి పెమ్మసాని కృతజ్ఞతలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులోని పలు దశలను, సమస్యలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఒక్కోటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఛానల్ ఆధునికీకరణ, విస్తరణ పనులకుగానూ రాష్ట్ర నిధులు కేటాయింపులు, రైతులను సమన్వయ పరుస్తూ భూముల సేకరణతో పాటు భూ పరిహారపు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయించడంలోనూ పెమ్మసాని తన మార్క్ పరిపాలనను చూపిస్తున్నారు. రైతులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రెండో దఫా నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించారు.
గుంటూరు ఛానల్ ఎక్స్‌టెన్షన్ పనుల కోసం భూసేకరణకు సహకరించిన 7 గ్రామాల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రెండో దఫా పరిహారపు నిధులను విడుదల చేసింది. ఎనమదల, ప్రత్తిపాడు, గారపాడు, కొండేపాడు, మల్లాయపాలెం, GG పాలెం, రావిపాడు గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాలకు మరో రూ.17.58 కోట్ల పరిహారం జమ అయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి & కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.
గతంలో విడుదల చేసిన రూ.10.54 కోట్లతో కలిపి ఆ రైతులకు ఇప్పటివరకు రూ.28.12 కోట్ల పరిహారం రైతులకు అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, పరిహారం చెల్లింపులను వేగవంతం చేసి, రైతులకు న్యాయం జరిగేలా ప్రత్యేక చొరవ చూపిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పెమ్మసాని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధి ప్రాజెక్టుల అమలుతో పాటు రైతుల ప్రయోజనాలను సమానంగా పరిరక్షిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుండటం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. రైతు సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి రెండింటికీ ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు.
ఎనమదల, ప్రత్తిపాడు గ్రామాల రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, సంబంధిత అధికారులకు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News