-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-మెగా డీఎస్సీలో అక్రమాలకు తావే లేదు
-వైసీపీ నేతల బిడ్డల సైతం డీఎస్సీలో క్వాలిఫై అయ్యి టీచర్లగా పనిచేస్తున్నారు
-ముఖ్యమంత్రిగా 2 లక్షలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుది
-5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వని జగన్
-మహానాడులో మహిళ రిజర్వేషన్ల ప్రకటనతో పనిచేయని జగన్ మైండ్
-మెగా డీఎస్సీలో అక్రమాలంటూ డైవర్షన్ పాలిటిక్స్ : మంత్రి సవిత మండిపాటు
-అనంతపురంలో మంత్రి సవిత చేతుల మీదుగా ప్రతిభ పురస్కారాల పంపిణీ
-750 మందికి నగదు ప్రోత్సాహకాలు, మెమోంటోలు అందజేత
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి… సీపీఎస్ రద్దు చేస్తాను… ఏటా డీఎస్సీ నిర్వహిస్తాను… జాబ్ క్యాలెండర్ ఇస్తాను…అని చెప్పారు. నేనొస్తే జాబులు వస్తాయన్నారు..కాని వైసీపీ హయాంలో డగ్ర్స్, గంజాయి వచ్చింది… ఆయనొస్తే చావు గ్యారంటీ’ అని జగన్ పై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత తీవ్రంగా విమర్శించారు. 2025 మెగా డీఎస్సీలో అక్రమాలకు తావేలేదని, అవకతవతకలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ రుజువులు చూపాలని మంత్రి సవిత సవాల్ విసిరారు. వైసీపీ పార్టీ నాయకుల బిడ్డలు సైతం మెగా డీఎస్సీలో ఎంపికై ఉపాధ్యాయులుగా పాఠాలు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నేటి వరకూ రెండు లక్షల పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారన్నారు. నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు టీచర్ల అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చారన్నారు. కాని, జగన్… అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా, గురువులను వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టాడని మండిపడ్డారు. ఆయనకు సీబీఐ అన్నా, ఆ సంస్థ చట్టాలన్నా గౌరవం లేదన్నారు. అనంతపురంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఆ సామాజిక వర్గానికి చెందిన 750 విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను మంత్రి సవిత చేతుల మీదుగా అందజేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల జరిగిన టీడీపీ హైబ్రీడ్ మహానాడులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధమవ్వడంతో జగన్ కు మైండ్ పనిచేయడం లేదన్నారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ కాకపోయినా, ఏపీ చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లను టీడీపీ అమలుచేయనుందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించడంపై మహిళలను విపరీతమైన స్పందన వస్తోందన్నారు. దీన్నిచూసి ఓర్వలేకపోతున్న జగన్ డైవర్షన్ పొలిటిక్స్ కు తెరతీశాడని మంత్రి సవిత మండిపడ్డారు.
జగన్ వస్తే చావే…
2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేయడంలో తీవ్రంగా విఫలమయ్యారని మంత్రి సవిత విమర్శించారు. సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయలేదన్నారు. ఏటా దీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఇస్తామని మాట తప్పారన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఉపాధ్యాయులను మోసగించాడన్నారు. అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా, చివరికి గురువులను మద్యం షాపుల దగ్గర కాపలాపెట్టిన దుర్మార్గుడు జగన్ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ సీఎం చంద్రబాబు రెండు లక్షలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారు. బాబు వస్తే జాబు గ్యారంటీ అని, జగన్ వస్తే జాబులు రాలేదని చావులు మాత్రం వచ్చాయని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దొరికిన డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నారన్నారు.
పాదర్శకంగా మెగా డీఎస్సీ
ఎప్పుడో ఏడాది కిందట జరిగిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగియంటూ జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని, ఎటువంటి రుజువులున్నా చూపించాలని సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో ఉద్యోగాల్లేక యువత మనోవేదనకు గురయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్ పై సీఎం చంద్రబాబు సంతకం చేసి, నిరుద్యోగులకు బాసటగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించి, 16 వేల టీచర్ పోస్టులు చేసిందన్నారు. వైసీపీ నాయకుల పిల్లలు సైతం డీఎస్సీలో క్వాలిఫై అయి పిల్లలకు పాఠాలు చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. సీబీఐ అన్నా, ఆ సంస్థ చట్టాలన్నా జగన్ కు గౌరవమే లేదని మంత్రి సవిత విరుచుకుపడ్డారు.
విద్యతోనే అందలం
అంతకుముందు కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా కూడా పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నామన్నారు. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో 550కి పైగా మార్కులు సాధించిన 24 మంది పేద విద్యార్థులకు రూ.25 వేలు చొప్పున, ఇంటర్ లో 950 మార్కులు సాధించిన 72 మంది విద్యార్థులకు రూ.50 వేలతో పాటు ల్యాప్ టాప్ అందజేయనున్నట్లు తెలిపారు. విద్యతోనే అందలం సాధ్యమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఉన్నత విద్యలు చదివించేలా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు సైతం తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ, సమాజాభివృద్ధి భాగస్వాములవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన 750 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, మెమోంటోలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఆ సామాజిక వర్గీయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News