Breaking News

అర్జీల పరిష్కారంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని, ప్రజల నుంచి అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ నారాయణ బందెల, డీఎస్పీ జి. శ్రీనివాసరావుతో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగంపై నమ్మకంతో అర్జీలు సమర్పిస్తున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి అధికారికి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని అత్యంత బాధ్యతాయుతంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని అర్థం చేసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం చోటుచేసుకోకుండా సంబంధిత శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా అర్జీదారులకు స్పష్టమైన పరిష్కారం అందించి, వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యంకాని అంశాల విషయంలో కూడా అర్జీదారులకు పూర్తి వివరాలు తెలియజేసి పారదర్శకత పాటించాలని సూచించారు.

అర్జీలలో కొన్ని:

తనకు నలుగురు ఆడపిల్లలు అని, పిల్లలకు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు లేవని, దీనివల్ల వారు చదువులు, సంక్షేమ పథకాలు పొందుటకు ఇబ్బందులు పడుతున్నారని, తమపై దయవుంచి వాటిని మంజూరు చేయాలని మచిలీపట్నం నగరంలోని 50వ డివిజన్ కు చెందిన టీ నాంచారమ్మ కలెక్టర్కు విన్నవించుకున్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, తక్షణమే వారికి ఆధార్ కార్డులు మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటిని ఆదేశించారు.

తనకు ఒక ఆడపిల్ల మగ పిల్లవాడు ఉన్నారని, కుమారుడికి వచ్చిన వ్యాధికి వైద్యం చేయించే స్తోమత లేక భర్త పురుగు మందు తాగి చనిపోయాడని, ప్రస్తుతం ఆడపిల్లకు ప్రమాదవశాత్తు కన్ను పోయిందని, సదరు వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం చేయాలని, అదేవిధంగా తనకు ఒంటరి మహిళ పింఛను, ఇళ్ల స్థలం మంజూరు చేయాలని గుడివాడ మున్సిపాలిటీ ఒకటవ వార్డుకు చెందిన బుడుమూరి శ్రీదేవి అర్జీ ద్వారా విన్నవించారు.

తన కొడుకు గోగులమూడి విజయ్ కుమార్ 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం వస్తున్న రూ.6వేలు పింఛన్కు బదులుగా రూ.15 మంజూరు చేసి ఆదుకోవాలని, అదేవిధంగా వీల్ చైర్ మంజూరు చేయాలని గుడివాడ మండలం, మోటూరు గ్రామానికి చెందిన జి మరియమ్మ కలెక్టర్ను కోరగా, ఆయన డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ యుగంధర్ ని పిలిపించి అర్హత మేరకు అతనికి పింఛను మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారిణి జే జ్యోతి, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజా, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారురి జి రమేష్, డీఎస్ఓ జి మోహన్ బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరాం ప్రసాద్, డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, హౌసింగ్ పీడీ వెంకట్రావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *