Breaking News

ఇళ్ల గణనను 100 శాతం ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి

– నగర ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి, కమిషనర్ కె. మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో జనాభా గణన–2026లో భాగంగా నిర్వహిస్తున్న ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో, మిగిలిన పనులను అత్యంత జాగ్రత్తగా, 100 శాతం ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని నగర ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ సూపర్వైజర్లను ఆదేశించారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఇళ్ల గణనపై ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కీలకమైన గణాంక ప్రక్రియల్లో జనాభా గణన ఒకటని, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన, మౌలిక సదుపాయాల ప్రణాళిక, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఈ గణాంకాలు ప్రామాణిక ఆధారాలుగా నిలుస్తాయని తెలిపారు. అందువల్ల ఇళ్ల గణనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి ఇంటి వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు.
జన గణన ప్రక్రియ తేలికగా, వేగంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇళ్ల గణనలో ఖచ్చితత్వం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. హౌస్ లిస్టింగ్ సమయంలో సేకరించిన వివరాల ఆధారంగానే తదుపరి జనాభా గణన నిర్వహించబడుతుందని, కాబట్టి ప్రతి నివాస గృహం, వాణిజ్య భవనం, సంస్థ, ఇతర నిర్మాణాల వివరాలు సక్రమంగా నమోదు కావాలని స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా లాక్డ్ హౌస్లు (తాళం వేసి ఉన్న ఇళ్లు), అపార్ట్‌మెంట్ సముదాయాలు, హాస్టళ్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు వంటి ఇన్‌స్టిట్యూషన్ల విషయంలో సూపర్వైజర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే సంబంధిత యాజమాన్యాలతో సమన్వయం చేసుకుని పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు.
ఎన్యూమరేటర్లు సమర్పిస్తున్న నివేదికలను సూపర్వైజర్లు ర్యాండమ్ పద్ధతిలో తనిఖీ చేయాలని, నమోదు చేసిన వివరాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించాలని కమిషనర్ తెలిపారు. ఎక్కడైనా వ్యత్యాసాలు, లోపాలు లేదా సమాచారం నమోదు చేయడంలో పొరపాట్లు గుర్తించినట్లయితే వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా ప్రతి వార్డు పరిధిలో గణన పురోగతిని రోజువారీగా సమీక్షిస్తూ, పెండింగ్‌లో ఉన్న గృహాలు, లాక్డ్ హౌస్లు, ప్రత్యేక సంస్థల వివరాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గణనలో పాల్గొంటున్న సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి నిర్ణీత గడువులోపు నాణ్యతతో కూడిన సమాచారాన్ని సేకరించాలని కోరారు.
జనాభా గణన–2026 విజయవంతంగా పూర్తయ్యేందుకు ప్రజలు కూడా సహకరించి, గణన సిబ్బందికి సరైన సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో జిల్లా ప్రిన్స్ పల్ అధికారి ఆదిలక్ష్మీ, చార్జ్ ఆఫీసర్లు జి. సాంబశివరావు, సిహెచ్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *