-MLA బొండా ఉమా అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలో చేరిన వడ్డెర సంఘస్తులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
60వ డివిజన్ వాంబే కాలనీ సీ-బ్లాక్‌లో ఈరోజు వడ్డెర సంఘ నాయకులు చెంబేటి వెంకట్ తమ అనుచరులతో కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ముందుగా వడ్డెర జాతి మహనీయుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చెంబేటి వెంకట్ తో పాటు వారి అనుచరులు బత్తుల సాంబయ్య, మల్లెల నరసింహారావు, జడపల్లి దుర్గంరాజు, బండారు వెంకట దుర్గారావు, మల్లెల లక్ష్మి, తమ్మిశెట్టి నారాయణమ్మ, డేరంగుల శంకరమ్మ, బత్తుల సౌజన్య, కొండ అనూష, వేముల శ్రీనివాసరావు తదితరులకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లులాంటిదని, బీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందని, ఉపాధి, విద్య, వ్యాపార అవసరాల కోసం ప్రయాణించే మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. అలాగే “తల్లికి వందనం” పథకం కింద ప్రతి అక్కచెల్లెమ్మ ఖాతాలో సంవత్సరానికి రూ.18,000 నేరుగా జమ చేసే ప్రక్రియను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుందని వెల్లడించారు.
ఆటో డ్రైవర్లు, బీసీ వర్గాలు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు లేదా ఇతర సమస్యలపై ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.
వడ్డెర సంఘం రాష్ట్ర చైర్మన్ మల్లెల ఈశ్వర్ మాట్లాడుతూ:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ, వడ్డెర మరియు ఇతర వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక వృత్తి ఆధారిత సామాజిక వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
మైనింగ్ రంగంలో వడ్డెరలకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వడ్డెర జాతి మహనీయుల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆ సామాజిక వర్గానికి గౌరవాన్ని పెంచిందన్నారు. బీసీ వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర చైర్మన్ మల్లెల ఈశ్వర్, 60వ డివిజన్ అధ్యక్షులు బేవర సూర్య, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, ఇంచార్జ్ ఎం. మల్లేశ్వరరావు, క్లస్టర్ ఇంచార్జ్ కంచి ధనశేఖర్, సీనియర్ నాయకులు బుగత శ్రీరాములు, వడ్డెర సంఘ సభ్యులు సావిత్రి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News