-కూటమి సంక్షేమం చూసి ఓర్వలేకే వైసీపీ తప్పుడు ప్రచారం
-త్వరలోనే విద్యుత్ శాఖలో ఏఈ పోస్టులను భర్తీ చేస్తాం
-పల్నాడు జిల్లాకు రూ.400 కోట్ల వ్యయంతో 21 వేల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు
-సీఎం చంద్రబాబు చొరవతోనే రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు
-ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేశామని పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి వైసీపీ నాయకులు ఓర్వలేక మెగాడీఎస్సీలో అక్రమాలు జరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టును కూడా భర్తీ చేయని వైసీపీకి, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టామని, త్వరలోనే ఏఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. తాము చేయలేని పనులను కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందనే అసహనంతో వైసీపీ నేతలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. సోమవారం నాడు పల్నాడు జిల్లా నకరేకల్లు మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కండ్లగుంట గ్రామంలో శాఖా గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లాలో ఇప్పటికే రూ.400 కోట్ల వ్యయంతో 21 వేల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కోటి సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఆంధ్రప్రదేశ్‌కు 20 లక్షల కనెక్షన్లు కేటాయించబడినట్లు మంత్రి వెల్లడించారు. ఈ 20 లక్షల కనెక్షన్లు పూర్తయితే రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ముఖ్యంగా ఓసీ, బీసీ వర్గాలకు చెందిన వినియోగదారులకు గణనీయమైన రాయితీలు లభిస్తున్నాయని తెలిపారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు స్వయం విద్యుత్ ఉత్పత్తికి ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10 వేల కోట్లకు పైగా జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News