-ఎటువంటి రాజకీయ జోక్యం, మధ్యవర్తుల ప్రమేయం, అక్రమాలకు అవకాశం లేదు
-నిబంధనల ప్రకారమే అర్హులైన క్రీడాకారులకు నియామకాలు
-తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తప్పవు
-రాష్ట్ర కీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ప్రతి దశను సాంకేతిక ఆధారిత ఆన్‌లైన్ విధానంలో నిర్వహించామని, అభ్యర్థులు దరఖాస్తు సమర్పణ నుంచి పోస్టు ఎంపిక వరకు ఎటువంటి వ్యక్తిగత సంప్రదింపులు లేకుండానే ప్రక్రియ పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో శాప్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన వార్తలు, సందేహాల నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు మరియు అభ్యర్థులకు వాస్తవ పరిస్థితులను స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
2024 నూతన క్రీడా విధానం – క్రీడాకారులకు విస్తృత ప్రోత్సాహం
రాష్ట్ర విభజన అనంతరం 2017లో అమలులోకి వచ్చిన క్రీడా విధానం 2022 వరకు కొనసాగిందని, అనంతరం రెండేళ్ల పాటు స్పోర్ట్స్ పాలసీ లేకపోయిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో జి.ఓ. నెం.18 ద్వారా సమగ్ర నూతన క్రీడా విధానాన్ని అమలు చేసిందని తెలిపారు. “Sports for All” లక్ష్యంతో యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, మహిళా మరియు పారాస్పోర్ట్స్ క్రీడాకారులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడం, ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, ప్రతిభావంతుల గుర్తింపు, అంతర్జాతీయ స్థాయి ప్రోత్సాహకాలు మరియు ఉద్యోగావకాశాల విస్తరణ వంటి అంశాలను ఈ విధానంలో పొందుపరిచినట్లు వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూలు, స్థానిక సంస్థల్లో క్రీడాకారులకు కల్పిస్తున్న రిజర్వేషన్‌ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచడం ఈ ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక విధానంలో కీలక నిర్ణయమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే 65 క్రీడా విభాగాలకు గుర్తింపు
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయించినవి కాదని, భారత ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ 2024 మార్చి 4న జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారమే గుర్తించబడినవని తెలిపారు. ఈ క్రీడా విభాగాలను Category-A, Category-Bగా విభజించి, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల ఎంపిక చేపట్టినట్లు వెల్లడించారు.
ఒలింపిక్ పతక విజేతలకు రూ.7 కోట్ల ప్రోత్సాహకం
ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్ల నగదు బహుమతి ప్రకటించిందని తెలిపారు. గతంలో రూ.70 లక్షలుగా ఉన్న ప్రోత్సాహకాన్ని భారీగా పెంచడం ద్వారా క్రీడాకారుల్లో నూతన ఉత్సాహం నింపామని పేర్కొన్నారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా, యూనివర్సిటీ గేమ్స్, జోనల్ పోటీలు, రాష్ట్ర స్థాయి పోటీల వరకు మొత్తం 96 ప్రాధాన్యత కేటగిరీలను ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించిందన్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టుల నోటిఫికేషన్
డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను నోటిఫై చేయగా, అందులో 3 శాతం క్రీడా కోటా కింద 421 పోస్టులను కేటాయించినట్లు తెలిపారు. ఈ నియామక ప్రక్రియలో 3,600 మంది అభ్యర్థులు మొత్తం 5,326 దరఖాస్తులు సమర్పించగా, తుది ఎంపికలో 382 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయని, ఇంకా 39 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని వెల్లడించారు. అన్ని పోస్టులు భర్తీ కాకపోవడమే ఎంపికలు పూర్తిగా అర్హత, ప్రాధాన్యత మరియు ప్రభుత్వ నిబంధనల ఆధారంగానే నిర్వహించబడినట్లు స్పష్టం చేస్తోందన్నారు.
తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్, ఆన్‌లైన్ విధానం
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తిస్థాయి వెబ్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో నిర్వహించినట్లు తెలిపారు. అభ్యర్థులు OTP ఆధారిత సురక్షిత ధృవీకరణతో తమ వ్యక్తిగత, విద్యార్హతలు, క్రీడా వివరాలను స్వయంగా పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. అభ్యర్థుల అర్హతలకు అనుగుణంగా పోస్టులు ఆటోమేటిక్‌గా ప్రదర్శించబడే విధంగా వ్యవస్థను రూపొందించడం ద్వారా మానవ జోక్యానికి అవకాశం లేకుండా పారదర్శకతను నిర్ధారించామని తెలిపారు. జిల్లా, పోస్టుల వారీగా ఖాళీల వివరాలను పోర్టల్‌లో అందుబాటులో ఉంచి అభ్యర్థులు స్వయంగా పోస్టులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తు వివరాల డౌన్‌లోడ్, ప్రింట్ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయించగా, సంబంధిత సంఘాలు, ఫెడరేషన్లు, యూనివర్సిటీలు మరియు ఇతర అధికార సంస్థల ద్వారా వాటి నిజానిజాలను నిర్ధారించిన అనంతరమే తాత్కాలిక ప్రాధాన్యత జాబితాను రూపొందించినట్లు వెల్లడించారు. అదేవిధంగా, డీఎస్సీకి నిర్దేశించిన విద్యార్హతల విషయంలో ఎటువంటి సడలింపులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ధ్రువపత్రాల పరిశీలనను పూర్తిస్థాయి పారదర్శక విధానంలో నిర్వహించాం
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలలో ధ్రువపత్రాల పరిశీలనను పూర్తిస్థాయి పారదర్శక విధానంలో నిర్వహించినట్లు తెలిపారు. జి.ఓ.ఎం.ఎస్. నెం.4 ప్రకారం శాప్ ఆరు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసి, అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన క్రీడా ధ్రువపత్రాలను పరిశీలించినట్లు వెల్లడించారు. అనంతరం 2025 ఆగస్టు 2, 3 తేదీల్లో విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో ఒరిజినల్ ధ్రువపత్రాల భౌతిక పరిశీలన నిర్వహించామని తెలిపారు. తదుపరి సంబంధిత క్రీడా ఫెడరేషన్లు, రాష్ట్ర క్రీడా సంఘాలు, యూనివర్సిటీల ద్వారా ధ్రువపత్రాల నిజానిజాలను నిర్ధారించామని చెప్పారు. అదేవిధంగా విద్యాశాఖ తరఫున 15 మంది అధికారులను నియమించి అభ్యర్థుల విద్యార్హతల ధ్రువపత్రాలను కూడా పరిశీలించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాలు మరియు సంబంధిత సంస్థల నుంచి పొందిన ధృవీకరణల ఆధారంగానే తాత్కాలిక ప్రాధాన్యత జాబితాను రూపొందించి, 2025 ఆగస్టు 8 నుంచి 14 వరకు శాప్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించిన అనంతరం తుది ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేసి, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కమిటీ 2025 ఆగస్టు 20న ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం ఆ జాబితాను 421 స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ కోసం 2025 ఆగస్టు 21న విద్యాశాఖకు పంపించినట్లు వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణ నుంచి ధ్రువపత్రాల అప్‌లోడ్, పరిశీలన, ధృవీకరణ, ప్రాధాన్యత జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడం ద్వారా పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను నిర్ధారించడంతో పాటు బాహ్య జోక్యం, అక్రమాలకు అవకాశాన్ని పూర్తిగా నిరోధించినట్లు తెలిపారు.
ధ్రువపత్రాల జారీ బాధ్యత ప్రభుత్వానికి కాదు
క్రీడా ధ్రువపత్రాలను ప్రభుత్వం, SAP అధికారులు లేదా ఇతర ప్రభుత్వ సిబ్బంది జారీ చేయరని ఆయన స్పష్టం చేశారు. క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు, యూనివర్సిటీలు మాత్రమే ధ్రువపత్రాలు జారీ చేస్తాయని, ఇది 2011 నుంచే దేశవ్యాప్తంగా అమలులో ఉన్న NSDC మార్గదర్శకాల ప్రకారమే కొనసాగుతోందన్నారు. అయితే, ధ్రువపత్రాల నిజానిజాలను నిర్ధారించడం మాత్రం ప్రభుత్వ బాధ్యతగా భావించి బహుస్థాయి పరిశీలన నిర్వహించినట్లు తెలిపారు.
బహుస్థాయి ధ్రువీకరణ వ్యవస్థ
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో స్క్రూటినీ కమిటీలు, స్క్రీనింగ్ కమిటీ, రాష్ట్ర స్థాయి ఉన్నత కమిటీ ద్వారా దశలవారీగా అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించినట్లు తెలిపారు. సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు, యూనివర్సిటీలకు అధికారికంగా లేఖలు రాసి ధ్రువపత్రాల నిజానిజాలను నిర్ధారించామని, రికార్డులు లేవని సమాధానం వచ్చిన ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు.
అభ్యంతరాల పరిష్కారానికి ప్రత్యేక అవకాశం
తాత్కాలిక జాబితాను ఆన్‌లైన్‌లో ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి తుది జాబితా సిద్ధం చేసినట్లు చెప్పారు. తరువాత రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదంతో జాబితాను విద్యాశాఖకు పంపగా, స్థానికత, రోస్టర్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం తుది ఎంపిక జాబితా విడుదలైనట్లు తెలిపారు.
హైకోర్టులో 69 కేసులు – ప్రభుత్వ విధానానికే మద్దతు
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఇప్పటివరకు 69 కేసులు హైకోర్టులో దాఖలయ్యాయని తెలిపారు. ఇప్పటికే విచారణ పూర్తైన మూడు కేసుల్లో ప్రభుత్వ కమిటీలు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానం సరైనవేనని గౌరవ హైకోర్టు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. మిగిలిన కేసులపై కూడా న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను ప్రభుత్వం గౌరవంతో అమలు చేస్తుందని పేర్కొన్నారు.
తప్పుడు ధ్రువపత్రాలపై కఠిన చర్యలు తప్పవు
తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఎప్పుడైనా నిర్ధారణ అయితే సంబంధిత అభ్యర్థిపై మాత్రమే కాకుండా ఆ ధ్రువపత్రం జారీ చేసిన సంఘం లేదా ఫెడరేషన్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత సంఘాల గుర్తింపును కూడా రద్దు చేసే అవకాశం ఉందన్నారు.
డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంపై వెంటనే FIR
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆడియో సందేశాలు వెలుగులోకి వచ్చిన వెంటనే క్రీడల శాఖ స్వయంగా స్పందించి 2025 జూలై 28న పల్లెకోన పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో బొంత రోశయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఆ వ్యక్తి SAP ఉద్యోగి కాదని, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కూడా కాదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎవరూ మధ్యవర్తులను నమ్మవద్దని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అప్పుడే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.
పూర్తిస్థాయి పారదర్శకతతోనే ఎంపికలు
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల మొత్తం ప్రక్రియను ఎటువంటి రాజకీయ జోక్యం, మధ్యవర్తుల ప్రమేయం, బాహ్య ప్రభావం లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర క్రీడా విధానం, క్రీడా ధ్రువపత్రాలు, ప్రాధాన్యత క్రమం, అర్హతలు వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే 382 మంది అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News