– ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం చేపట్టిన ఉమీద్ (UMEED) పోర్టల్ డేటా నమోదు గడువు జూన్ 6 తో ముగియనున్నందున, ఇప్పటికీ వివరాలు నమోదు చేయని వక్ఫ్ సంస్థలు, ముతవల్లీలు వెంటనే స్పందించాలని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కోరారు. రాష్ట్రంలోని వేలాది వక్ఫ్ సంస్థల వివరాలు ఇప్పటికే ఉమీద్ పోర్టల్‌లో నమోదు కాగా, ఇంకా కొంతమంది ముతవల్లీలు మరియు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ, భవిష్యత్తు న్యాయపరమైన పోరాటాలు, ఆక్రమణల నివారణ మరియు డిజిటల్ రికార్డుల సృష్టికి ఉమీద్ పోర్టల్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. జూన్ 6 తర్వాత గడువు పొడిగింపుపై ఎటువంటి హామీ లేదని, అందువల్ల చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా పెండింగ్‌లో ఉన్న అన్ని వివరాలు, పత్రాలు మరియు రికార్డులను వెంటనే పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. వక్ఫ్ ఆస్తులను రక్షించుకోవాలంటే ముందుగా వాటిని ప్రభుత్వ డిజిటల్ రికార్డుల్లో నమోదు చేయడం అత్యవసరమని పేర్కొంటూ, ఈ అంశాన్ని ప్రతి ముతవల్లి వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ రోజు నమోదు చేసే సమాచారం రేపటి వక్ఫ్ ఆస్తుల రక్షణకు కవచంగా నిలుస్తుంది అని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News