Breaking News

నేటి నుంచి హజ్ యాత్రికుల రాక ప్రారంభం

-హజ్ యాత్ర ముగించుకుని స్వదేశాలకు వచ్చిన హాజీలకు ఘన స్వాగతం: రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా పవిత్ర హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు విజయవంతంగా యాత్రను ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ భాష తెలిపారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక విమానాల ద్వారా హజ్ యాత్రికులు విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారని ఆయన గుంటూరు కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హాజీ హసన్ భాష మాట్లాడుతూ పవిత్ర హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న హాజీలకు రాష్ట్ర హజ్ కమిటీ తరఫున హృదయపూర్వక స్వాగతం పలికినట్లు తెలిపారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి మొదటి దశలో ఏప్రిల్ 18, 19 తేదీల్లో బయలుదేరిన 333 మంది హజ్ యాత్రికులు తిరిగి మూడు ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి చేరుకుంటున్నారని వెల్లడించారు.

రోజుకు 111 మంది చొప్పున మంగళవారం, బుధవారం, గురువారం మూడు రోజుల వ్యవధిలో యాత్రికులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. జూన్ 2న మధ్యాహ్నం 1.10 గంటలకు, జూన్ 3న మధ్యాహ్నం 1.00 గంటలకు, జూన్ 4న రాత్రి 11.20 గంటలకు ప్రత్యేక విమానాలు విజయవాడకు చేరుకుంటాయని పేర్కొన్నారు.

హజ్ యాత్రికుల రాక సందర్భంగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. యాత్రికుల కుటుంబ సభ్యులు, బంధువులు విమానాల సమయాలను గమనించి స్వాగత కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ ఏడాది దాదాపు 2,000 మంది హజ్ యాత్రికులు పవిత్ర మక్కా, మదీనా నగరాలకు వెళ్లారని, వారందరూ సురక్షితంగా యాత్రను పూర్తి చేసుకుని తిరిగి రావడం ఆనందదాయకమని హాజీ హసన్ భాష అన్నారు. హజ్ యాత్రికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.

విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లి వచ్చిన ప్రతి యాత్రికుడికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వం మైనార్టీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రతి హాజీకి అభినందనలు తెలియజేస్తూ, వారి ప్రార్థనలు రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, సుభిక్షం తీసుకురావాలని ఆకాంక్షించారు.

హజ్ యాత్రికుల రాక సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు, జిల్లా హజ్ కమిటీ ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, స్వచ్ఛంద సేవకులు, యాత్రికుల కుటుంబ సభ్యులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని వారికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

హజ్ యాత్రికుల రాకతో వారి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పవిత్ర హజ్ యాత్ర అనంతరం స్వదేశానికి చేరుకున్న హాజీలను బంధుమిత్రులు ఆప్యాయంగా ఆహ్వానించడంతో గన్నవరం విమానాశ్రయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
మౌలానా ముస్తాక్ అహ్మద్, మొహమ్మద్ షీబ్లి, హజ్ కమిటీ డైరక్టర్లు మౌలానా ఆబిద్ మన్సూర్ అలీ అహ్మద్ మాబు భాష, హజ్ కమిటీ సి ఈ ఓ గౌస్ పీరా పాల్గొని విజయవంతం చేశారని ఆయన చెప్పారు.
ఈ హజ్ యాత్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు రాష్ట్ర మైనార్టీ శాఖ, న్యాయశాఖ మంత్రి ఫరూక్, శాసనమండలి మాజీ చైర్మన్ ప్రభుత్వ సలహాదారుడు షరీఫ్ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని హాసన్ భాష ప్రకటించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *