అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’ పేరుతో ప్రత్యేక అంతర్గత కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా విశ్వమానవతా భావాలను స్మరించుకుంటూ, కులాలను కలిపే ఆలోచనా విధానం మరియు మత ప్రస్తావనలకు అతీతమైన బాధ్యతాయుత రాజకీయాలు జనసేన సిద్ధాంతాల్లో భాగమని స్పష్టం చేశారు.
ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత తప్పులను కులం, మతం, ప్రాంతంతో ముడిపెట్టి విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణి పెరుగుతోందని, వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలే గానీ సామాజిక వర్గాలను వివాదాల్లోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అనుసరిస్తోందన్నారు.
నేటి జెన్-జీ యువత కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు లేని రాజకీయాలను కోరుకుంటోందని పేర్కొంటూ, అదే దిశగా ‘సేనా గళం’ కమిటీ పనిచేస్తుందని వివరించారు. ఈ కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన సభ్యులు ఉంటారని, అనుచిత వ్యాఖ్యలు లేదా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలపై కుల, వర్గ రాజకీయాలకు తావులేకుండా కమిటీ సభ్యులే బాధ్యతాయుతంగా స్పందించి పార్టీ వైఖరిని ప్రజలకు తెలియజేస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, లోకం నాగమాధవి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు టి. శివశంకర్, డా. పెదపూడి విజయ్ కుమార్, చిల్లపల్లి శ్రీనివాసరావు, వంపూరు గంగులయ్య, కడలి ఈశ్వరి, నాయుబ్ కమల్, పి.వి.ఎస్.ఎన్. రాజు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News