Breaking News

దేశ ప్రగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్ర బిందువు: గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్

-డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ, 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు అధ్యక్షత వహించిన గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని, నాణ్యమైన, అందుబాటులో ఉండే, అందరికీ సమానంగా చేరువయ్యే వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ, 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు ఆయన అధ్యక్షత వహించి స్నాతకోత్సవ ప్రసంగం చేశారు.

వైద్య విద్య, ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్య, ఆరోగ్య మౌలిక వసతులు, ప్రజారోగ్య సేవల విస్తరణ ద్వారా ఈ లక్ష్య సాధనకు కృషి చేస్తోందని గవర్నర్ తెలిపారు. వైద్య రంగానికి విశిష్ట సేవలను యూనివర్సిటీ అందించిందన్నారు.. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైద్య, ఆరోగ్య విజ్ఞాన విద్యలో విశిష్టమైన వారసత్వాన్ని నిర్మించుకుందని, వైద్యులు, దంతవైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియోథెరపిస్టులు మరియు అనుబంధ ఆరోగ్య నిపుణులను తీర్చిదిద్దుతూ దేశ విదేశాల్లో ఆరోగ్య సేవల బలోపేతానికి దోహదపడిందని గవర్నర్ కొనియాడారు.

విద్యార్థులు ప్రజాసేవ, మానవ గౌరవ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు. డీఎండీసీ కేంద్రం ఏర్పాటు అభినందనీయం అని అన్నారు. విశ్వ విద్యాలయంలో సమీకృత వ్యాధి పర్యవేక్షణ కార్యక్రమం (IDSP) కింద ఏర్పాటు చేసిన “డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సెంటర్ (DMDC)”ను గవర్నర్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వ్యాధుల అంచనా, విశ్లేషణ, నిర్ణయాల రూపకల్పనలో నిపుణులను తీర్చిదిద్దే ఈ కేంద్రం శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

విద్యార్థులు యోగా, ధ్యానం సాధన చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని, తగిన విశ్రాంతి, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నర్ సూచించారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి, జీవితాంతం నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.

29వ స్నాతకోత్సవ ముఖ్య అతిథి, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల అరిథ్మియా మరియు ఎలక్ట్రోఫిజియాలజీ సేవల డైరెక్టర్ డాక్టర్ సి. నరసింహన్‌కు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ (డి.ఎస్‌సి.) పట్టా ప్రదానం చేశారు.

30వ స్నాతకోత్సవంలో హైదరాబాద్ అపోలో ఆసుపత్రుల కార్డియాక్ సైన్సెస్ విభాగం డైరెక్టర్, హెచ్‌వోడీ డాక్టర్ పి.సి. రాత్‌ కు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ (డి.ఎస్‌సి.) పట్టా ప్రదానం చేశారు.

విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించి విద్య, పరిశోధన, సాంకేతికత, విద్యార్థుల సంక్షేమ రంగాల్లో సాధించిన పురోగతిని వివరించారు.

అనంతరం ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను జ్ఞాపికతో సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *