-పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలి
-ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఆన్ లైన్ లో బిల్లులు కనిపించాలి
-రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల అమలులో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు.
స్థానిక మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో బుధవారం మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ… ఇంజనీరింగ్ పనుల్లో ఎదురౌతున్న భూ, సాంకేతిక, ఏజెన్సీ సమస్యల పరిష్కారమే వర్క్ షాపు లక్ష్యం అన్నారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లతో ప్రతి నెల లేదా 15 రోజులకు ఒకసారి జోన్ల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశాల ద్వారా సమస్యల పరిష్కారం వేగవంతమవడంతో పాటు పనులపై మెరుగైన అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. 2019లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) ద్వారా రూ.5,350 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ గత ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేదని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ.3,000 కోట్లతో పాటు ఇతర ప్రాజెక్టులను కూడా గత ప్రభుత్వంలో వినియోగించుకోలేదన్నారు.
స్వచ్ఛ భారత్, గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన మంత్రి, మురుగునీటి శుద్ధి ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని, చేసిన ప్రతి రూపాయి ఖర్చు ఆన్‌లైన్‌లో నమోదు కావాలని ఆదేశించారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. బాత్రూమ్‌లు, కిచెన్‌లు, టాయిలెట్ల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ఎస్‌టీపీ (STP) ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. ప్లాంట్ల నుంచి విడుదలయ్యే నీరు కాలువల్లోకి వెళ్లే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్లాంట్ల ఏర్పాటులో భూసేకరణ, భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడంలో కలెక్టర్ల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి (వేస్ట్ టు ఎనర్జీ) లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. విజయవాడ, నెల్లూరు, కొండపల్లి ప్రాంతాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ నెల 20 వ తేదీలోపు పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో 70 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, మరో 5 అన్న క్యాంటీన్లను పది రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నరు. రాష్ట్ర వ్యాప్తంగా 153 లక్షల టన్నుల వ్యర్థాల్లో 128 లక్షల టన్నుల వ్యర్థాలను తొలగించామన్నారు. ప్రతి అధికారి తనకు అప్పగించిన ప్రాజెక్టులపై క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేస్తూ లక్ష్యాలను సాధించాలని, ప్రజలకు త్వరితగతిన ప్రయోజనాలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగూరు నారాయణ సూచించారు.
ఏపీయూడీఐఎఫ్‌సీ (Andhra Pradesh Urban Development and Infrastructure Finance Corporation – ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థ) చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ… పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి వందలాది ప్రాజెక్టులను రాష్ట్రంలోఅమలు చేస్తుందన్నారు.
ప్రభుత్వం పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, 24 గంటల తాగునీటి సరఫరా సహా మౌలిక వసతులను మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కరించుకోవాలని అధికారులకు సూచించారు.
మున్సిపల్ వ్యవహారాల శాఖ ఏపియూఎఫ్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వివిధ ఆర్థిక వనరుల ద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
పురపాలక శాఖ పథకాలపై నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ, ఇంత భారీ స్థాయిలో చేపట్టనున్న పనుల అమలుకు ఇంజనీరింగ్ విభాగం సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమృత్ 2.0, యూఐడీఎఫ్, ఏఐబీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ తదితర పథకాల కింద ఇప్పటికే వేల కోట్ల రూపాయల పనులు మంజూరయ్యాయని తెలిపారు.
కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ ఎమ్. ప్రభాకర్ రావు మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 20,000 కోట్ల రూపాయల పనులు అర్భన్ ఏరియా మున్సిపాటిల్లో చేసే అవకాశం మనకు లభించిందన్నారు. ఈ పనుల్లో ఏ మాత్రం అశ్రద్ధకు తావులేకుండా పూర్తి సమన్వయంతో క్వాలిటీ గా పనులు చేయాలని ఇంజనీర్లను కోరారు.
వర్క్ షాపులో మురుగునీటి పారుదల పథకాలపై పి.ఎల్.వి. కార్తిక్, వర్షపు నీటి కాలువల (స్టార్మ్ వాటర్ డ్రెయిన్స్) నిర్మాణం, నిర్వహణపై ప్రహ్లాదన్, పనుల నాణ్యత ప్రమాణాలు, పర్యవేక్షణ అంశాలపై అరుణ్ కుమార్, సంస్కరణలు, ప్రోత్సాహకాలపై ఎన్.వి. రావు, రహదారులు, రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై టి. పార్వతీశం, వర్క్స్ మాడ్యూల్ నిర్వహణపై జి. రవితేజ, ఎన్‌ఐడిహెచ్‌ఐ (NIDHI) పోర్టల్ వినియోగంపై వి. శ్రీనివాసరావు వర్క్ షాపుకు హాజరైన అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అమృత్ 2.0, ఎస్బీఎమ్ 2.0, యూఐడీఎఫ్, యూసీఎఫ్, ఏపీయూడబ్లూఎస్ఎస్ఎమ్ఐపీ, తదితర పట్టణాభివృద్ధి పథకాల అమలు, నిధుల వినియోగం, ప్రాజెక్టుల పర్యవేక్షణ అంశాలపై అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు.
Prajavartha Online Telugu News