– రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
– ఆరోగ్యకర ఓటర్ల జాబితా రూపకల్పన ప్రతిఒక్కరి బాధ్యత
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తున్నామని.. ఈ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు.
బుధవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సర్‌పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించి జిల్లాస్థాయిలో కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లకు శిక్షణతో పాటు సన్నద్ధత కార్యకలాపాలు ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను పోలింగ్ బూత్ స్థాయి బీఎల్‌వోలకు అందజేసి ఈ నెల 15వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు సమాచారాన్ని సేకరించనున్నట్లు తెలిపారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ల స్వీకరణ ఉంటుందని.. ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)ను నియమించుకోవాల్సిందిగా కోరారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకర ఓటర్ల జాబితా కీలకమని, దోష రహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జరుగుతున్న కృషికి రాజకీయ పక్షాలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1,792 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. కొత్తగా 129 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, సీహెచ్ చిట్టిబాబు (తెదేపా), తరుణ్ కాకాని (భాజపా), జె.శ్రీనివాస్ (జనసేన), యారడ్ల ఆంజనేయ రెడ్డి (వైఎస్ఆర్‌సీపీ), కె.పరమేశ్వరరావు (ఏఏపీ), రాంమోహన్‌రావు, టి.వెంకటేశ్వరరావు (బీఎస్‌పీ), డీవీ కృష్ణ (సీపీఐ-ఎం), కలెక్టరేట్ సమన్వయం విభాగం అధికారి అనుష్ కుమార్, ఎన్నికల డీటీ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News