Breaking News

పుష్క‌రాల కోసం రూ.5.63 కోట్ల‌తో 3 స్థానిక ప్ర‌భుత్వాసుప‌త్రుల అభివృద్ధి

-కొవ్వూరు, నిడ‌ద‌వోలు, మండ‌పేట ఆసుప‌త్రుల్లో అద‌న‌పు సౌక‌ర్యాలు
-ఆమోదించిన వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావ‌రి పుష్క‌రాల్లో భారీ స్థాయిలో పాల్గొనే ప్ర‌జ‌ల వైద్యావ‌స‌రాల నిమిత్తం స్థానికంగా ఉన్న 3 సెకండ‌రీ ఆసుప‌త్రుల‌ను అభివృద్ధి చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ దిశ‌గా కొవ్వూరు లోని ప్రాంతీయ ఆసుప‌త్రి, నిడ‌ద‌వోలు మ‌రియు మండ‌పేటలోని క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ల‌లో అద‌న‌పు నిర్మాణాలు, సౌక‌ర్యాల కోసం రూ. 5.63 కోట్ల వ్య‌యంతో ప్ర‌ణాళిక‌ను వైద్యారోగ్య శాఖా మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ బుధ‌వారంనాడు ఆమోదించారు.

పుష్క‌రాల్లో ప‌విత్ర స్నానాలు చేసేందుకు భారీగా రానున్న ప్ర‌జ‌ల అవ‌స‌రాల మేర‌కు ఈ మూడు ఆసుప‌త్రులను త‌గు రీతిన అభివృద్ధి చేయాల‌ని తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ చేసిన విన్న‌పంపై ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వివిధ ప్ర‌తిపాద‌న‌ల‌కు స‌మ్మ‌తి తెలిపారు.

ఆసుప‌త్రులవారీగా అభివృద్ధి ప‌నులు

మండ‌పేట సీహెచ్‌సీ అభివృద్ది కోసం రూ. 3.75 కోట్లతో ప‌లు ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌స్తుతం 30 ప‌డ‌క‌ల‌తో న‌డుస్తున్న ఈ ఆసుప‌త్రిని 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిగా అభివృద్ధి చేసే ప‌నిలో భాగంగా రానున్న పుష్క‌రాల సంద‌ర్భంగా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల్ని చేప‌ట్టాల‌ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ వి.జోగేశ్వ‌ర‌రావు సూచించారు. ఇందులో భాగంగా ఆసుప‌త్రి భ‌వ‌న రెండ‌వ ఫ్లోర్ నిర్మాణ ప‌నుల్ని పూర్తి చేయ‌డంతో పాటు అనుబంధ నిర్మాణాలు, సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేస్తారు.

నిడ‌ద‌వోలు సీహెచ్‌సీకి సంబంధించి రూ.1 కోటి ఖ‌ర్చుతో అద‌న‌పు ఓపీ క‌న్సల్టేష‌న్ గ‌దులు, 8 టాయిలెట్లు, 270 మీట‌ర్ల మేర‌కు ప్ర‌హారీ గోడ నిర్మాణం.సీసీ రోడ్ల నిర్మాణం, జ‌న‌రేట‌ర్, బోర్‌వెల్ ఏర్పాటు, వైద్య ప‌రిక‌రాలు మ‌రియు ఫ‌ర్నీచ‌ర్ కొనుగోలు, నీరు మ‌రియు విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌కు సంబంధించి ప‌నులు చేప‌డ‌తారు.

కొవ్వూరు ప్ర‌భుత్వాసుప‌త్రిలో రూ.88 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో దెబ్బ‌తిన్న ఫ్లోరింగ్ మార్పిడి ప‌నులు, డ్రైనేజీ వ్య‌వ‌స్థ అభివృద్ధి, పైక‌ప్పు మ‌ర‌మ్మ‌తులు, ఆసుప‌త్రి భ‌వ‌నానికి రంగులు వేయ‌డం, కొత్త ట్రాన్స్‌ఫార్మ‌ర్ మ‌రియు జ‌న‌రేట‌ర్ ఏర్పాటు, బాత్రూరూంల‌కు మ‌ర‌మ్మ‌తులు మ‌రియు కొత్త‌వాటి నిర్మాణం, ఎల‌క్ట్రిక‌ల్ వైరింగ్ ప‌నులు చేప‌డతారు.

ప‌విత్ర గోదావ‌రి పుష్క‌రాలు 26-06-2027 నుంచి 07-07-2027 దాకా 12 రోజుల పాటు సాగుతాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *