అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యాలయంలో నేడు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, కామన్ గుడ్ ఫండ్ (CGF) నిధుల వినియోగం, ధూప-దీప-నైవేద్యాల పథకం అమలు, ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
అలాగే రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు.
దేవాదాయ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరేలా అధికారులు కృషి చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల మెరుగుదల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్‌లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఇంజనీర్ శేఖర్‌తో పాటు దేవాదాయ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News