Breaking News

ఆసుపత్రుల ఆవరణలో మొక్కలు నాటాలి

-ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు జరపాలి
-వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని రకాల ఆసుపత్రుల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, ఆరోగ్య సంస్థల్లో సుస్థిర విధానాల అమలుపై అవగాహన కల్పించాల‌ని పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రులు, కళాశాలల ఆవరణలో మొక్కల్ని నాట‌డంతో పాటు అవగాహన సదస్సులు, ఉపన్యాసాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నీటి సంరక్షణ, విద్యుత్‌ పొదుపుపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, వారి సహాయకులు, సందర్శకులకు వీలైనంత మేర మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించే పోస్టర్లు, బ్యానర్లు, ఐఈసీ ప్రచార సామగ్రిని ప్రదర్శించాలని సూచించారు. డైరెక్ట‌ర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్ట‌ర్ విష్ణువ‌ర్ధ‌న్ గురువారం వేర్వేరు ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేశారు.

సెకండరీ హెల్త్ శాఖలోని ప్రతి ఉద్యోగీ తమ కార్యాలయాలు, ఆసుపత్రుల ఆవరణలో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని చ‌క్ర‌ధ‌ర్ బాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెకండరీ హెల్త్ ఆసుప‌త్రులు, కార్యాల‌యాల్లో జూన్ 5న కనీసం 12,500 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు ఆయ‌న‌ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు, సిబ్బంది అందరూ భాగస్వాములు కావాలని కోరారు. మొక్కల మనుగడ శాతం పెరిగేలా అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఆరోగ్యవంతమైన మొక్కల్ని ఎంపిక చేసుకోవాలన్నారు. మొక్కలు నాటే ముందు తగిన పరిమాణంలో గుంతలు తవ్వి, స్థానిక సేంద్రియ ఎరువులతో నింపాలని సూచించారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, బోధనాసుపత్రులు, ప్రత్యేక వైద్యాసుపత్రులు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, పాఠశాలల్లో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాల‌ని డిఎంఈ డాక్ట‌ర్ విష్ణు వర్ధన్ ఆదేశాలు పంపారు. డాక్ట‌ర్లు, సిబ్బంది అంద‌రినీ భాగ‌స్వామ్యం చేయాల‌ని ఆయ‌న సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *