-బ్యాంకులు, ఎలఐసీ వాటాదారులా?
-నీట్, సిబిఎసఈ పరీక్షల నిర్వహణలో వైఫల్యం
-ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సత్వరమే చెల్లించాలి
-సంపద సృష్టికాదు, అప్ప్పుల సృష్టే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం
-సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
-పెట్టుబడులు, ఉద్యోగ కల్పనపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి
-మున్సిపల్ సేవలు ప్రైవేట్ అప్పగించే చర్యలు విడనాడాలి
-పర్యావరణ పరిరక్షణలో ప్రచారానికే పరిమితం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజేష్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ కంపెనీలో రూ.15 లక్షల 15 వేల కోట్ల అతిపెద్ద కుంభకోణం దేశంతోపాటు ప్రపంచాన్ని కుదిపేసిందని, ఇలాంటి స్కామ్ ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదనీ, ఇది మోదీ అవినీతి పరిపాలనకు నిదర్శనమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంలో బ్యాంకులు, ఎలఐసీలు 10.8 పెట్టుబడులు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, దానికి సంబంధించిన 109 పేజీల నివేదిక ఇచ్చారని వివరించారు.
ఈ రోజు విజయవాడ దాసరి భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ గతంలో హర్షద్ మెహతా రూ. 1000 కోట్ల స్కామ్ జరిగినప్పుడు దేశంతోసహా, ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసిందని, ఇప్పుడు రాజేశ్ ఎక్స్‌పోర్టు స్కామ్ దాన్ని మించి పోయిందన్నారు. ఈ స్కామ్‌లో రాజకీయ నేతలు ఎవరెవరున్నారు, ఇన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరుగుతుంటే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష అక్రమాలపైన, సీబీఎసఈ పరీక్షల నిర్వహణపై పెద్దఎత్తున చర్చ జరుగుతోందన్నారు. తాజాగా ప్రత్యేకించి విద్యార్థుల, యువతకు సంబంధించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని, నీట్‌లో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. సీబీఎసఈ పరీక్షా విధానంలో మోదీ సర్కార్ అట్టర్ ప్లాఫ్ అయిందని దుయ్యబట్టారు. నీట్ పరీక్షను మళ్లీ రాయలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దురదృష్టకరమన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ పరిపాలనలో మొత్తంగా ఫెయిల్ అయిందని, ఒక పక్క ఆర్థిక నేరాలు పెట్రేగిపోతున్నాయని, మరోవైపు పరీక్షల నిర్వహణ దారుణంగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజలంతా తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికే ప్రజలపై పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల భారాలను మోదీ ప్రభుత్వం మోపిందన్నారు. పైపెచ్చూ పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించి, ప్రజలు పొదుపు చేయాలంటూ మోదీ, చంద్రబాబు పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజలపై పదేపదే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారాల పెంపును నిరసిస్తూ ఈనెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చాయని, వాటిని ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. అదే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ జాతీయ పిలుపుమేరకు ఆగస్టు 6వ తేదీ నుంచి 15వరకు దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించనున్నామని తెలిపారు. ఒక వైపు రైతుకు సరిపడా ఎరువులు ఇవ్వలేని పరిస్థితి నెలకొనగా రైతులు పంటలెలా పండిస్తారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని దుస్థితిలో దేశంలోని 146 కోట్ల మందికి ఆహార ధాన్యం సరఫరాలను ఎలా చేస్తారని సూటిగా ప్రశ్నించారు.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్భాటంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏకంగా కళాశాలల యాజమాన్యాల ఖాతాలోకే చేరేలా చూస్తామని ప్రకటించి, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని సక్రమంగా అమలు చేయలేకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయలేకపోవడంతో రూ.4 వేల కోట్ల ఫీజు బకాయిలు నిలిచిపోయాయని చెప్పారు. దీంతో విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసినప్పటి¿, వారికి సకాలంలో సర్టిఫికెట్లు చేతిక రాకపోవడంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని తెలిపారు. దీంతో ఆన్‌లైన్లో ప్రవేశపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీకి 2.23 కోట్ల మంది ఫాలోవర్లు అతి తక్కువ వ్యవధిలో వచ్చారని, దీనికి కేంద్రంపై యువతలో ఉన్న వ్యతిరేకతే కారణమని స్పష్టం చేశారు. 6న దిల్లీకి వస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నిర్వాహకుడిని అరెస్టు చేస్తారన్న ప్రచారముందని, అలాంటి చర్యలు విడనాడాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మోదీ దాసోహంగా మారితే, మోదీకి చంద్రబాబు వంత పాడుతున్నారని విమర్శించారు. భారతదేశ విదేశాంగ విధానం, ఆర్థిక విధానాలతోనే నేడు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు రామకృష్ణ బదులిస్తూ అమరావతిలో ఇప్పటికే 54 వేల ఎకరాల భూ సమీకరణ చేశారని, ముందు దాన్ని అభివృద్ధి చేయాలని, రైతుల నుంచి బలవంతంపు భూ సమీకరణ ఆపాలన్నారు. నాడు జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీలంకగా గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఇప్పుడు ఆయన చేస్తుందేమిటంటూ నిలదీశారు. జగన్ ప్రభుత్వ ఐదేళ్లల్లో రూ.3 లక్షల 33 వేల కోట్ల అప్పులు చేస్తే, చంద్రబాబు రెండేళ్ల పాలనలో రూ.3 లక్షల 47 వేల కోట్లు అప్పులు చేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టిస్తానని చెప్పి, అప్పులు పుట్టించేలా సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఈ రెండేళ్లల్లో మహిళలకు ఉచిత బస్సు, పెన్షన్లు మినహా, మిగిలిన హామీలు చేసిందేమీ లేదన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనపై సంబరాలు ఎలా చేసుకుంటుందంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడుల విషయంలో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొందన్నారు. పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి కొన్ని అంశాలు మినహా, మిగతా హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేదలకు పట్టణాల్లో రెండు, గ్రామాల్లో మÖడు సెంట్ల ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం వంటి అంశాల్లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదన్నారు. జగనన్న కాలనీల పేరుతో చేపట్టిన కార్యక్రమాలను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పినా, ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, ఆధునిక సాంకేతికతతో గృహాలు నిర్మిస్తామని చెప్పినా, ఫలితాలు మాత్రం ప్రజలకు అందలేదని వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీల్లో సేవలను ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 14 రకాల మున్సిపల్ సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ప్రజా వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందన్నారు. గత ప్రభుత్వాలపై చెత్త పన్ను పేరుతో విమర్శలు చేసిన వారు, ఇప్పుడు అదే విధానాలను కొనసాగించడం ప్రజలను నిరాశకు గురిచేస్తోందని మండిపడ్డారు.
పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు. ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, వాటి సంరక్షణపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రచారం చేస్తూనే, మరోవైపు అదే ప్లాస్టిక్ వినియోగానికి అనుమతులు ఇవ్వడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. మహానాడు వేదికగా ప్రకటించిన రూ.24 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాల అంశంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి?, ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడ్డాయి, ఏ రంగాల్లో అవకాశాలు కల్పించబడ్డాయో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగ భృతి, వాలంటీర్ల వేతనాల పెంపు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాల్లో ఎటువంటి పురోగతి లేదన్నారు. రాష్ట్రంలో 2.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు తగిన నోటిఫికేషన్లు విడుదల కాలేదని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం వుందన్నారు. కడప స్టీల్ ప్లాంట్, కొప్పర్తి పారిశ్రామిక వాడ వంటి ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంజాబ్‌లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారని, ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. నిరుద్యోగ భృతి కింద ఒకొక్కరికి ఈ రెండేళ్లల్లో రూ.72 వేల చొప్ప్పున ప్రభుత్వం బకాయి పడిందన్నారు. గత ఉగాది నాటికే టిడ్కో ఇళ్లు ఇస్తామని ఆర్భాటంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించినా తర్వాత లబ్దిదారులకు కేటాయించకుండా దగా చేశారని మండిపడ్డారు. నాడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు బీజేపీతో జతకట్టగానే ధరల పెంపు కన్పించడంలేదా? అని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News