విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. రామవరప్పాడు రింగ్‌లోని ఎస్ఎల్వీ గ్రీన్ మెడోస్ నివాసం నుంచి ఆటోనగర్‌లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు ఆమె సైకిల్‌పై వెళ్లారు. అనంతరం ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత రాష్ట్ర ప్రజలకు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంమంత్రి పేర్కొన్నారు. చెట్ల పెంపకం పర్యావరణాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం “నో వెహికల్ డే”గా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా పాటించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడటమే భావితరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని ఆమె అన్నారు. సైకిల్‌పై ప్రయాణించడం గర్వకారణమని, సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన తొలి రోజునే విజయవాడ నగర వీధుల్లో సైకిల్‌పై తిరగడం ఎంతో ఆనందంగా ఉందని హోంమంత్రి తెలిపారు. జీవితం చాలా చిన్నదని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం గంట సమయాన్ని తమ ఆరోగ్యం కోసం కేటాయించాలని సూచించారు. సైకిల్ వినియోగాన్ని పెంచడంతో పాటు బ్యాటరీ వాహనాల వినియోగాన్నీ ప్రోత్సహించాలని హోంమంత్రి అనిత ప్రజలకు పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News