Breaking News

గిరిజన విధ్యార్ధులు అన్ని రంగాల్లో రాణించాలి

-ప్రతిభకు ప్రోత్సాహం – గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
-గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఒక్కో విద్యార్థిపై రూ. లక్ష ఖర్చు
-గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన విద్యార్థుల్లో ఉన్న భయం, బిడియం, సంకోచాలను విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను అధిరోహించాలని గిరిజన సంక్షేమ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మార్చి 2026 లో నిర్వహించిన ఎస్సెస్సీ (పదో తరగతి) మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారికి దిశానిర్దేశం చేసిన ఉపాధ్యాయులను స్థానిక తుమ్మల పల్లి కళా క్షేత్రంలో ఘన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధిగా గిరిజన సంక్షేమ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరై మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై దాదాపు రూ. లక్ష వరకు వ్యయం చేస్తూ నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్ధులు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ‘తల్లికి వందనం’ పథకంతో పాటు యూనిఫారాలు, బూట్లు, పుస్తకాలు, ట్రంక్ బాక్సులు, బెడ్‌షీట్లు తదితర అవసరాల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు.

టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి, 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించిన పార్ధు, 590 మార్కులు సాధించిన జాస్మిన్ వంటి విద్యార్థులు గిరిజన సమాజానికి ఆదర్శంగా నిలవడంతోపాటు తోటి విద్యార్ధులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా క్రీడలు, శారీరక వ్యాయామం, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయి, బెట్టింగ్ వంటి దురలవాట్లకు, ఆత్మహత్యలు వంటి క్షణికావేశ నిర్ణయాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. తల్లిదండ్రుల సూచనలు పాటిస్తూ సరైన మార్గంలో పయనించాలని కోరారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యాల కోసం రూ. 2,500 కోట్లు కేటాయించామని తెలిపారు. గతంలో గంజాయి సాగు జరిగిన ప్రాంతాల్లో దానిని పూర్తిగా నిర్మూలించి, సుమారు రెండు లక్షల ఎకరాల్లో కాఫీ సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో విస్మరించిన పథకాలైన గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, టార్పాలిన్లు, ఆయిల్ ఇంజిన్లు, ట్రాక్టర్లు అందజేస్తున్నామని వెల్లడించారు.

పల్నాడు జిల్లా ఎత్తిపోతల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు పాములను ముందుగానే గుర్తించే ‘ప్రోటోటైప్ షూ’ రూపొందించి రాష్ట్రస్థాయి అవార్డు సాధించడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. వారి సృజనాత్మకతను అభినందిస్తూ, భవిష్యత్తులో రైతుల భద్రతకు ఉపయోగపడేలా ఇలాంటి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇటీవల భర్తీ చేసిన 16 వేల ఉపాధ్యాయ పోస్టుల్లో 2 వేల పోస్టులు గిరిజనులకు దక్కాయని, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గిరిజన హక్కుల పరిరక్షణకు జీవో నెం. 3 స్ఫూర్తితో కొత్త విధానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి ఎం. మల్లిఖార్జున నాయక్ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు ఓపెన్ కేటగిరీ విద్యార్థులతో సమానంగా అత్యుత్తమ మార్కులు సాధించడం వారి ప్రతిభకు నిదర్శనమన్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం మరింత పెంచి 90 శాతానికి పైగా తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకుని సమాజంలో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్. భార్గవి మాట్లాడుతూ… రాష్ట్ర జనాభాలో 5.53 శాతం ఉన్న గిరిజనుల విద్యాభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.1,672 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలోని 2,712 గిరిజన విద్యా సంస్థల్లో 2.14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందన్నారు. 29 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం విశేషమన్నారు.

గురుకులం విద్యా సంస్థల కార్యదర్శి ఎం. గౌతమి మాట్లాడుతూ… ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించడం ద్వారా ఇతర విద్యార్థుల్లో పోటీ తత్వం, చదువుపై ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ‘మైల్’ (MILE) ప్రత్యేక కార్యక్రమం ద్వారా టెన్త్ ఫలితాల్లో 6 శాతం మెరుగుదల నమోదైందన్నారు. ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో మరింత మంది విద్యార్థులు రాణించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనాం (అమ్మ పేరుతో ఒక మొక్క) మొక్కను నాటారు. అనంతరం గిరిజన బాలికలు తమ సాంప్రదాయ నృత్యాలతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ని సభా వేదిక వద్దకు తోడ్కొని వెళ్లారు..

కార్యక్రమంలో 176 మంది ప్రతిభా పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు. వీరిలో ట్రైబల్ వెల్ఫేర్ నుండి 87 మంది, గురుకులం నుండి 89 మంది ఉన్నారు.

సన్మాన గ్రహీతల్లో…

ఎస్ఎస్ సి లో స్టేట్ టాపర్స్ (ట్రైబల్ వెల్ఫేర్ 18/గురుకులం 18) 36 మంది, ఎస్ఎస్ సి డిస్ట్రిక్ట్ టాపర్స్ లో ట్రైబల్ వెల్ఫేర్ నుండి 18 మంది,గురుకులం నుండి 18 మొత్తం 36 మంది, బెస్ట్ టీచర్స్/ లెక్చరర్స్ (ట్రైబల్ వెల్ఫేర్ 7/ గురుకులం 18) 25 మంది, బెస్ట్ హెడ్మాస్టర్స్/ ప్రిన్సిపల్స్ (ట్రైబల్ వెల్ఫేర్ 4/ గురుకులం 8) 12 మంది, బెస్ట్ హెచ్ డబ్ల్యుఓఎస్. (ట్రైబల్ వెల్ఫేర్ ) 6 గురు, ఇంటర్మీడియట్ స్టేట్ ఆఫర్స్ (ట్రైబల్ వెల్ఫేర్ 14/ గురుకులం 12) 26 మంది, ఇంటర్మీడియట్ డిస్ట్రిక్ట్ టాపర్స్ (ట్రైబల్ వెల్ఫేర్ 15/ గురుకులం 10) 25 మంది, ఐఐటీ/ జేఈఈ ఎచీవర్స్ ( గురుకులం ) 5 గురు, స్పెషల్ అవార్డ్స్ (ట్రైబల్ వెల్ఫేర్) 5 గురు ఉండగా మొత్తం 176 మంది అందుకున్నారు.

అవార్డులు ప్రదానానంతరం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం లో విదార్థులు చెప్పిన పలు విషయాలను తెలుసుకుని పలు సూచనలు అందించారు.

కార్యక్రమంలో ట్రైకార్ ఎండీ మణికుమార్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ (విద్యా సంబంధం) ప్రతిభా భారతి, ఏడీ సరస్కతి, గిరిజన సంక్షేమ, గురుకుల సంక్షేమ శాఖ అధికారులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *