Breaking News

పకడ్బందీగా బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణ

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-బీసీ హాస్టళ్లు, గురుకులాలకు గ్రేడింగ్
-గ్రేడింగ్ ఆధారంగా బదిలీలు, పదోన్నతులకు ప్రాధాన్యం
-త్వరలో 1,291 పారిశుధ్య సిబ్బంది నియామకం
-142 మంది కుక్, కుమాటీలను కూడా…
-బీసీ హాస్టళ్లకు సచివాలయాల సిబ్బంది
-224 మంది వీఆర్వోలు, మహిళా పోలీసులకు డిప్యూటేషన్
-6 ఎంజేపీ స్కూళ్లకు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-బీసీ విద్యార్థుల కోసం 2 ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటు
-1400 మందికి ఐఐటీ, నీట్ శిక్షణ
-బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం : మంత్రి సవిత
-వార్డెన్లు, ఎంజేపీ ప్రిన్సిపాల్లతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోపణలకు తావివ్వకుండా రాష్ట్రంలో బీసీ హాస్టళ్లు, గురుకులాలను పకడ్బందీగా నిర్వహించాలని, పనితీరు ఆధారంగా వాటికి గ్రేడింగ్ లు ఇవ్వనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. గ్రేడింగ్ ఆధారంగా భవిష్యత్తులో చేపట్టబోయే బదిలీలు, పదోన్నత్తుల్లో ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, దీనిలో భాగంగా త్వరలో 1,291 పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు. కొత్తగా 142 మంది కుక్, కమాటీలను నియమించనున్నామని, సచివాలయాల నుంచి 224 మంది వీఆర్వోలను, మహిళా పోలీసులను డిప్యూటేషన్ ప్రభుత్వం హాస్టళ్లకు కేటాయించిందని తెలిపారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కాబోయే నూతన విద్యా సంవత్సరం సందర్భంగా హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయాలని, పరిసరాలను, మరుగుదొడ్లను, తాగునీటి ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాలకు చెందిన హాస్టల్ వార్డెన్లు, ఎంజేపీ స్కూళ్ల ప్రిన్సిపాల్లు, ఏబీసీడబ్ల్యూవోలు, డీబీసీడబ్ల్యూవోలతో మంత్రి సవిత శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లను, ఎంజేపీ గురుకులాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలుకలు, బొద్దింకలు, ఇతర కీటకాలు రాకుండా హాస్టళ్లు, గురుకులాల పరిసరాలతో పాటు తరగతి గదులు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లను, బాత్ రూమ్ లను శుభ్రం చేయాలన్నారు. దోమలు చొరబడకుండా ఉండేలా తరగతి, విశ్రాంతి గదుల ద్వారాలకు, కిటికీలకు దోమ తెరలు తక్షణమే అమర్చాలన్నారు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుతో పాటు నూతన మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సవిత ఆదేశించారు.

త్వరలో 1,291 పారిశుధ్య సిబ్బంది నియామకం

కూటమి ప్రభుత్వం బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారంతో పాటు ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేస్తోందన్నారు. దీనిలో భాగంగా త్వరలో 1,291 పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. ఈ నియామకాలకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటిరకే చేపట్టామన్నారు. హాస్టళ్లు, గురుకులా పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తద్వారా విద్యార్థుల ఆరోగ్య రక్షణకు వీలుకలుగుతుందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా హాస్టళ్లు, గురుకులాలకు వచ్చే విద్యార్థులకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టంచేశారు. బయట ఆహారం లోపలికి తీసుకురావొద్దని, దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలపాలని మంత్రి సవిత సూచించారు.

142 కుక్, కమాటీ పోస్టులు

ప్రభుత్వమందించే మెనూ సక్రమంగా అమలు చేయడంతో పాటు రుచికరమైన భోజనం అందించడానికి 142 కుక్, కమాటీ పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఖాళీలు, ఆయా హాస్టళ్లలో ఖాళీలను బట్టి కుక్ లు, కమాటీలను నియమిస్తామన్నారు. 224 మంది సచివాలయాల సిబ్బందిని డిప్యూటేషన్ పై బీసీ హాస్టళ్లలో తీసుకోనున్నట్లు వెల్లడించారు వారిలో 126 మంది వీఆర్వోలను, 98 మంది మహిళా పోలీసులు ఉన్నారన్నారు. వారికి హాస్టళ్ల నిర్వహణ, ఇతర అంశాలపై రెండ్రోజుల పాటు శిక్షణ కూడా ఇవ్వనున్నామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల హాస్టళ్లకు ధీటుగా బీసీ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కిచెన్ గార్డెన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా హాస్టళ్లు, గురుకులాల్లో ఉంటే ఖాళీ ప్రదేశాల్లో కూరగాయల పెంపుదల చేపట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం చేపట్టాలని మంత్రి సవిత స్పష్టంచేశారు.

పనితీరు ఆధారంగా గ్రేడింగ్

హాస్టళ్లు, గురుకులాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బోధన, నిర్వహణ, మెనూ అమలు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. హాస్టళ్ల వార్డెన్లు, గురుకులాల ప్రిన్సిపాళ్ల బదిలీలు, పదోన్నతుల కల్పనలో ఈ గ్రేడింగ్ ను పరిగణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలన్నారు. వేసవి సెలవుల తరవాత హాస్టళ్లు విద్యార్థులు వస్తున్నారని, సహాజంగానే వారికి ఇంటిపై బెంగ ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు మనో ధైర్యం కలిగేలా వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. బెదిరింపులు, హెచ్చరికల ధోరణులతో కాకుండా స్నేహపూర్వకంగా మెలగాలని మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.

6 ఎంజేపీలు కళాశాలలుగా అప్ గ్రేడ్

రాష్ట్రంలో ఆరు ఎంజేపీ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. త్వరలో ప్రారంభం కాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించనున్నామన్నారు. ఆత్మకూరు, వనిపెంట, నరసన్నకోట, గొలగమూడి, కొత్తవలస, కలికిరి ఎంజేపీ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. బీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ కు శిక్షణిచ్చేలా రెండు ఎక్స్ లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1400 మంది విద్యార్థులతో ఈ రెండు సెంటర్లను ఈ విద్య సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరో పది ఎంజేపీ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో వాటి ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి రానుందని తెలిపారు. ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్ లో ఎంజేపీ, బీసీ హాస్టళ్ల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారంటూ సిబ్బందని అభినందించారు. రాబోయే టెన్త్, ఇంటర్ లోనూ అత్యుత్తమ ఫలితాల సాధించడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సవిత సూచించారు.

ఆరోపణలకు తావివ్వొద్దు…

హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో ఎటువంటి ఆరోపణలకు, అవకతవకలకు తావివ్వొద్దని మంత్రి సవిత హెచ్చరించారు. గతేడాది కొన్ని విమర్శలు కొందరిపై వచ్చాయని, అవి సరికాదని స్పష్టం చేశారు. కొందరి వల్ల మొత్తం వ్యవస్థపైనే విమర్శలు, ఆరోపనలు రావడం సరికాదని, అటువంటి వారిని ఉపేక్షేంచేది లేదని స్పష్టంచేశారు. బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణకు సకాలంలోనే నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి సవిత తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *