Breaking News

డ్రైనేజీ సమస్యలు లేని సర్వాంగ సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, నగరాన్ని డ్రైనేజీ సమస్యలు లేని సర్వాంగ సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో భాగంగా రెండో వారం డ్రైన్ల శుభ్రం విజయవంతంగా జరిగిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత వారం రోజుల్లో నగరంలోని అన్ని డివిజన్లలో ఉన్న చిన్న మరియు మీడియం డ్రైన్లను పూర్తిగా గుర్తించి, వాటిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడికను తొలగించి శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. పారిశుధ్య పనుల్లో ఎక్కడా అలసత్వం వహించకుండా పనుల వేగాన్ని పెంచేందుకు వీలుగా ప్రతి రోజు ప్రతి డివిజన్‌కు 100 మంది చొప్పున అదనపు పారిశుధ్య కార్మికులను తీసుకొని, వీరందరితో నగరంలోని అంతర్గత రహదారులు, కాలువలను సమగ్రంగా శుభ్రం చేయించడం జరిగిందని పేర్కొన్నారు.
అదేవిధంగా వర్షాకాలంలో నగరంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా, వరద ముప్పును నివారించేందుకు ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో మేజర్ కాలువల ప్రక్షాళన చేపట్టామని, ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా షుమారు 45 కిలోమీటర్ల పొడవునా ఉన్న ప్రధాన మేజర్ డ్రైన్లు, 80 కిలోమీటర్ల మీడియం డ్రైన్లలో అత్యాధునిక యంత్రాలు, సిబ్బంది సహాయంతో పూడికతీత పనులను పూర్తి చేశామన్నారు. రానున్న వర్షాలను తట్టుకునేలా నగర డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేయడమే మొదటి ప్రాధాన్యత అని, ఇందుకోసం ఇంజినీరింగ్ మరియు పారిశుధ్య విభాగాలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టామన్నారు. ఈ వారంలో మరింత పక్కా ప్రణాళికతో ప్రతిరోజూ ఉదయం పూట డ్రైన్ డీసిల్టింగ్, బ్యాక్ లేన్ శానిటేషన్, నాలాల పిచ్చిమొక్కల తొలగింపు, తుఫాను నీటి కాలువల క్లియరెన్స్, నిల్వ నీటి తొలగింపు మరియు యాంటీ-లార్వా వంటి దోమల నివారణ చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు వివరించారు. అలాగే మధ్యాహ్నం వేళల్లో యంత్రాల సహాయంతో ప్రధాన డ్రైన్ల పూడికతీత, అంతర్గత మరియు కాలువల శుభ్రం, డ్రైనేజీ అడ్డంకుల తొలగింపుతో పాటు వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి శుభ్రం చేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులన్నింటినీ ఫోటో డాక్యుమెంటేషన్ మరియు నిరంతర నివేదికల ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. నగర ప్రజలు కూడా కాలువల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా నగరపాలక సంస్థకు సహకరించాలని, ఈ నెల 8 నుండి 13 వరకు నివాస, వాణిజ్య, భారీ వ్యర్ధాల ఉత్పత్తిదారులకు అవగాహన పై జరిగే ఆపరేషన్ క్లీన్ స్వీప్ 3వారం కార్యక్రమాల్లో కూడా విస్తృతంగా పాల్గొని, గుంటూరును స్వచ్ఛ నగరంగా మార్చే ఈ ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ లో భాగస్వాములు కావాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *