Breaking News

ఇబ్బందులకు తెర.. ఎల్ఏ సాగరం వద్ద రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

-తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి స్పందన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారి-71 ఆరు లేన్ల విస్తరణ పనుల కారణంగా నాయుడుపేట సమీపంలోని మందబయలు, కారుమంచివారి ఖండ్రిగ, కానూరు, తాళ్వాయపాడు హరిజనవాడ గ్రామాలతో పాటు అవని అపార్ట్‌మెంట్‌కు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సంబంధిత గ్రామాల ప్రజలు, అవని అపార్ట్‌మెంట్ నివాసితులు ఈ ఫిబ్రవరిలో తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసి సమస్యను వివరించారు.

నాయుడుపేట సమీపంలోని ఎల్ఏ సాగరం వద్ద బాక్స్ బ్రిడ్జ్ నిర్మించినప్పటికీ సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ఆయా గ్రామాలకు కనెక్టివిటీ లేకుండా పోయిందని, దీంతో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అదనంగా సుమారు మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎంపీ, సమస్య పరిష్కారం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. స్థానిక ప్రజలు, విద్యార్థులు, రైతులు ప్రతిరోజూ నాయుడుపేట పట్టణానికి వెళ్లే మార్గం మూసివేయబడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన లేఖలో వివరించారు.

ఈ లేఖకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి అజయ్ టమ్టా స్పందింస్తూ, సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ మేరకు తిరుపతి ఎంపీ గురుమూర్తికి పంపిన లేఖలో వివరాలను తెలియజేశారు. ఏప్రిల్ 12న ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. పరిశీలనలో కిలోమీటర్ 54.800 నుంచి 55.100 వరకు ఉన్న బండ్ల బాటను ఆ ప్రాంత ప్రజలు నాయుడుపేట పట్టణానికి చేరుకునేందుకు వినియోగిస్తున్నట్లు గుర్తించామని, జాతీయ రహదారి నిర్మాణం కారణంగా ఆ అనుసంధానం దెబ్బతిన్న విషయాన్ని కూడా అంగీకరించారు.

సమస్య పరిష్కారానికి అవని అపార్ట్‌మెంట్ ప్రాంతంలోని కిలోమీటర్ 54.398 నుంచి ప్రారంభమై, కిలోమీటర్ 54.800 వద్ద ఉన్న బాక్స్ బ్రిడ్జ్‌తో అనుసంధానమయ్యే విధంగా సుమారు 550 మీటర్ల పొడవుతో బండ్ల బాట నిర్మాణ పనులు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ మార్గం పునరుద్ధరణ ద్వారా నాయుడుపేట పట్టణానికి ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు, రహదారులపై ప్రమాదకరమైన క్రాస్ మూవ్‌మెంట్ తగ్గి రోడ్డు భద్రత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సానుకూలంగా స్పందించి చర్యలు చేపట్టడం ఆనందదాయకమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్‌లోనూ, కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద నిరంతరం కృషి కొనసాగిస్తానని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *