విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో బ్రాహ్మణ సామాజికవర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు “బ్రాహ్మణ సంక్షేమ ఆత్మీయ చర్చా గోష్టి” జరిగింది. ఆదివారం గాంధీనగర్లోని ఐలాపురం హోటల్‌లో “బ్రాహ్మణ సంక్షేమ ఆత్మీయ చర్చా గోష్టి” రాష్ట్రస్థాయి సమావేశం శ్రీ వేద విజ్ఞాన పరిషత్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ శాసనసభ్యులు మల్లాది వాసు తదితర ప్రముఖులు హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ.. బ్రాహ్మణ సంక్షేమానికి అభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేస్తామని, అందరిని ఒక్కచోటికి చేర్చి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
శ్రీ వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ డి.వి. బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ నిష్పాక్షిక వేదిక ఈ సమావేశానికి ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, అందరూ కేవలం బ్రాహ్మణులుగా మాత్రమే హాజరై తమ అమూల్యమైన సలహాలు అందించారన్నారు. ముఖ్యమైన చర్చాంశాలు ప్రధానంగా బ్రాహ్మణ సత్రాలు, ఈనాం భూములు, వ్యక్తిగత ఆస్తుల రక్షణతో పాటు వేద పాఠశాలలు, పండితులు, అర్చకుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. రాజకీయ చైతన్యం ఇతర రాష్ట్రాల్లో బ్రాహ్మణులు రాజకీయంగా సాధిస్తున్న విజయాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే దిశగా అడుగులు వేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, పాత్రికేయలు మరియు కళాకారులు తదితరులు వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారన్నారు. అనంతరం చర్చలో అజెండా తీర్మానాలు అందరూ ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు, మేధావులు, విశ్లేషకులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News