-ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటర్ జాబితానే అత్యంత కీలకం
-అర్హులకు ఓటు హక్కు కల్పించాలి.. నకిలీ ఓటు ఉండడానికి వీల్లేదు
-రెండేళ్లలో సాధించిన ప్రగతి, చేసిన మంచి, అమలు చేసిన సంక్షేమం ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి
-మచిలీపట్నంలో SIR అవగాహన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ పార్టీకి ఎన్నికలు అత్యంత కీలకం, అందులో ఓటర్ జాబితా మరింత కీలకమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన SIR అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. 2002 తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతోంది. ఓటరు జాబితాపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ నెల 10లోగా నియోజకవర్గ స్థాయి సమావేశాలు పూర్తి చేసుకుని, 14లోపు మండల స్థాయి సమావేశాలు పూర్తి చేసుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేయడం అనివార్యం. గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకుడిపై ఉంది. ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన ఎన్నికలు గమనిస్తే.. ఓటర్ జాబితా అత్యంత కీలకం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. తీవ్ర నష్టం జరుగుతుందని 2019 ఎన్నికలు నిరూపించాయి. 2019 ఎన్నికల్లో ఒక్కో బూతుకు సగటున 10 ఓట్ల వరకు తొలగించారు. మొత్తం 200 బూత్‌లలో దాదాపు ఐదారు వేల ఓట్లు తొలగించారు. అంతే తేడాతో ఓటమి పాలయ్యాం.
అందుకే ఇప్పుడు ఓటర్ జాబితాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. బూత్ లెవల్ ఏజెంట్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ వారి వారి బూత్‌లో ఓటర్ జాబితాను పరిశీలించాలి. పాత కొత్త ఓటర్ జాబితాలను దగ్గర పెట్టుకుని ఓట్లను చెక్ చేసుకోవాలి. చనిపోయిన వారి ఓటు తొలగించారో లేదో పరిశీలించాలి. అదే సమయంలో కొత్త ఓటుకు అర్హత ఉన్న వారికి కూడా ఓటు హక్కు కల్పించాలి. ఫారం 6, 7, 8 గురించి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలి. జూన్ 15 నుండి జులై 14 వరకు ఇంటింటికి అధికారులతో పాటు వెళ్లి ఓట్లను పరిశీలించాలి. పోలింగ్ స్టేషన్లలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినా వారికి వివరించాలి. జులై 21న ముసాయిదా వస్తుంది. అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే పరిశీలించాలి. సెప్టెంబరులో తుది ఓటర్ జాబితా వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలి.
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రెండేళ్లు పూర్తైన సందర్భంగా అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ గారు, పవన్ కల్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. మిగిలిన హామీలను కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. పరిశ్రమలు, పెట్టుబడులు, అభివృద్ధి, పోలవరం, అమరావతి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తున్నాం.
ఎప్పుడూ మహానాడుకు మనం వెళ్తాం. కానీ ఈ సారి మహానాడు మన వద్దే జరిగింది. సుమారు 11 క్లస్టర్లలో అద్భుతంగా నిర్వహించాం. జిల్లాలోనే అత్యధికంగా 20 వేల మందితో మహానాడు నిర్వహించుకోవడం అభినందనీయం. ప్రతి నెల మొదటి బుధవారం యూనిట్ స్థాయిలో సమావేశం నిర్వహించుకుంటున్నాం. మండల స్థాయి, పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించాలని నిర్ణయించారు. ప్రతి క్లస్టర్ ఇంఛార్జి ఆధ్వర్యంలో గడపగడపనా ప్రభుత్వ సంక్షేమాన్ని వివరించాలి. త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయబోతున్నాం. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ వంటి పథకాలు కూడా అమలు చేయబోతున్నాం. కూటమి పార్టీ నాయకులంతా కలిసి అడుగేస్తూ ప్రభుత్వ విజయాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రం కోసం పడుతున్న కష్టాన్ని ప్రతి ఒక్కరం గుర్తించాలి. గూగుల్, అర్సెలార్ మిట్టల్ లాంటి సంస్థల్ని ఏపీకి వచ్చాయంటే అది ప్రభుత్వ ఘనత. త్వరలోనే బందరు పోర్టును పూర్తి చేయబోతున్నాం. షిప్ బిల్డింగ్ కంపెనీ కూడా బందరులో ఏర్పాటు కాబోతోంది.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక జగన్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నాడు. నిన్నటి వరకు మూడు రాజధానులు అన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. జగన్ రెడ్డి పీఏ సుమారు 1500 కోట్లు ఆస్తులు కూడబెట్టాడు. అంటే జగన్ రెడ్డి దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి. తల్లి, చెల్లికి న్యాయం చేయనోడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటున్నాడు. రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన జగన్ రెడ్డి.. ఇప్పుడు వెన్నుపోటు అంటున్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్న జగన్ రెడ్డి.. మద్యంలో దోపిడీ మొత్తం బయటకొస్తోంది. కన్న తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించి తండ్రికి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. రూ.3000 పెన్షన్ పేరుతో వృద్ధులకు వెన్నుపోటు పొడిచాడు. బాబాయి హత్య కేసులో సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచాడు. ఇలాంటి గొడ్డలి పార్టీ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.
బందరులో ఉన్న బియ్యం దొర.. ఎప్పుడూ ఏదో ఒకటి వాగడం తప్ప సాధించేదేమీ లేదు. బందరులో పోటీ చేయడానికి భయపడి పారిపోయినోడు.. గుడివాడ, గన్నవరం నాయకులకు టికెట్లు లేవు అంటూ వాగుతున్నాడు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ.. పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేశ్ లాంటి వారు మంత్రులుగా ఉండి ఏమైనా ఉద్దరించారా? ఒకడు బియ్యం దోపిడీ, మరొకడు గంజాయి, ఇంకొకడు పేకాటతో జిల్లా పరువు తీశారు. పోలీసులకు అన్యాయం చేసిందని మాట్లాడుతున్న పేర్ని నాని.. గత ఎన్నికల్లో పోలీసులు మిమ్మల్ని చీ కొట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీలాంటి రాక్షస మూక మాకొద్దని తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేసుకోండి. నంద్యాల జిల్లాలో వైఎస్ విగ్రహం తలను వైసీపీ కార్యకర్త విరగ్గొడితే..దాన్ని రాజకీయం చేయాలనుకున్నారు. కులం మతం ప్రాంతం పేరుతో రాజకీయం చేయాలనుకుని భంగపడ్డారు.
తెలుగుదేశం పార్టీలో పని చేసిన వారికి తగిన గౌరవం ఇస్తాం. రాజ్యసభ సీట్ల గురించి కూడా నీతి మాలిన రాజకీయం చేస్తున్నాడు. గతంలో గుడివాడలో బీసీలను రెచ్చగొట్టాలని ప్రయత్నించాడు. పవన్ కల్యాణ్ గారి గురించి నీచంగా మాట్లాడాడు. చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ పార్టీ కోసం చేసిన కృషి ఏంటో పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటి వారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని గుర్తుంచుకో పేర్ని నానీ.
గత ఐదేళ్లు ఏరోజైనా బీసీలను గానీ, ఎస్సీని గానీ కూర్చోబెట్టారా? బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేలను జగన్ రెడ్డి ముందు మోకాలిపై కూర్చోబెట్టినోళ్లు కూడా కులం గురించి మాట్లాడడం సిగ్గుచేటు. మచిలీపట్నంలో పేర్ని నాని లాంటి దుర్మార్గులు ఉండడం మన దౌర్భాగ్యం. మచిలీపట్నం పోర్టును ఉద్యమాలతో సాధించుకుంటే.. పెయిడ్ ఆర్టిస్టులు అన్న దుర్మార్గుడు పేర్ని నాని. బందరు పోర్టు పూర్తి చేయకపోతే ముక్కు నేలకు రాస్తానన్న పేర్ని నాని ఎందుకు మాట తప్పాడు. ఇప్పుడు బందరు పోర్టును తెలంగాణకు ఇచ్చేస్తున్నామంటున్నాడు. ఈ రోజు చెబుతున్నా.. బందరు పోర్టు కోసం పోరాడింది మేమే.. శంకుస్థాపన చేసింది మేమే.. పూర్తి చేసేది కూడా మేమే. పోర్టు విషయంలో ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా.. ప్రజలు నమ్మబోరు. బందరు పోర్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఎన్ని కుట్రలు చేసినా పూర్తి చేసి చూపిస్తాం. వైసీపీ నేతల అరాచాకాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.
ఓటర్ జాబితాను పూర్తి చేసుకున్న తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 డివిజన్లు, 34 పంచాయతీల్లో కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలి. నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేస్తాం. మున్సిపాలిటీ అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయిలు ఈ ఏడాదిలో ప్రారంభించి వచ్చే ఏడాది నాటికి ప్రతి ఇంటికీ అందించి తీరుతాం. నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటుగా యువతకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తాం. అవసరమైన మేరకు ఇక్కడే ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఉపాధి కల్పిస్తాం. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో అనూహ్య మార్పులు సాధించి చూపిద్దామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, పట్టణాధ్యక్షులు లోగిశెట్టి స్వామి, బాబాప్రసాద్, కుంచె దుర్గాప్రసాద్ గారు, పల్లపాటిసుబ్రహ్మణ్యం గారు, రూరల్ అధ్యక్షులు కాగిత వెంకటేశ్వరరావు గారు తదితర నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News