– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
– విద్యార్థులు వచ్చేనాటికి హాస్టళను, గురుకులాలను శుభ్రం చేయండి
– బీసీ బిడ్డల ఉన్నత విద్యే కూటమి లక్ష్యం
– రెండు ఉచిత నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రాల ఏర్పాటు
– ఆప్కో, లేపాక్షి షో రూమ్ ల్లో అమ్మకాలు పెంచండి
– బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖాధికారుల సమీక్షలో మంత్రి సవిత
తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు, విమర్శలకు తావివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఆప్కో, లేపాక్షి షో రూమ్ ల్లో అమ్మకాలు పెంచాలని, చేనేతలకు, హస్త కళాకారులకు రోజూ ఉపాధి కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పప్టం చేశారు. స్థానిక పద్మావతి గెస్ట్ హౌస్ లో బీసీ సంక్షేమ, ఆప్కో, లేపాక్షి అధికారులతో మంత్రి సవిత మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల వారీగా చేపడుతున్నఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖాధికారులతో మాట్లాడుతూ, కొద్ది రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుందన్నారు. విద్యార్థులు హాస్టళ్లలో చేరేలోగా, తరగతి గదులను, విశ్రాంతి గదులను, మరుగుదొడ్లను, బాత్ రూమ్ లను శుభ్రం చేయాలన్నారు. హాస్టళ్లు, గురుకులాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. హాస్టళ్లు, గురుకుల్లాల్లో చేరే విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. బీసీ బిడ్దలకు ఉన్నత విద్య అందించాలన్నది సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో అత్యధిక మంది విద్యార్థులను చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంలో భాగంగా ఐఐటీ, నీట్ కు ఉచిత శిక్షణ అందజేయనున్నామన్నారు. విశాఖ, టేకులోడు ఎంజేపీ స్కూళ్లలో రెండు ఉచిత నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. బాలురకు, బాలికలకు వేర్వేరుగా ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ శిక్షణా తరగతులు ప్రారంభించనున్నామని మంత్రి సవిత వెల్లడించారు.
ఆరోపణలకు ఆస్కారమివ్వొద్దు…
గతేడాది బీసీ హాస్టళ్ల వార్డెన్లపై విపరీతమైన ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. ఇది క్షమించరాని నేరమన్నారు. భవిష్యత్తులో బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణపై ఎటువంటి ఆరోపణలు వస్తే సహించేది లేదన్నారు. సంబంధిత వార్డెన్లు, ప్రిన్సిపాళ్ల చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. హాస్టళ్లు, గురుకులాల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల సంస్థల నేపథ్యంలో వార్డెన్లు, ఎంజేపీ గురుకులాల ప్రిన్సిపాల్లు అమరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్షాలు సైతం హాస్టళ్లను, గురుకులాలను సందర్శించి నిర్వహణ బాగోలేదంటూ మీడియాకు లికేజీ ఇచ్చ ప్రమాదముందని హెచ్చరించారు. త్వరలో మెస్ ఛార్జీలు పెంచనున్నామని, బాధ్యతాయుతంగా మెలగాలని వార్డెన్లు, ప్రిన్సిపాళ్ల కు మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.
అమ్మకాలు పెంచండి..
అనంతరం చేనేత, హస్త కళల అధికారులతో మంత్రి సవిత కీలక భేటీ నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఎన్ని ఆప్కో, లేపాక్షి షో రూమ్ లున్నాయన్నారు. ఆయా షో రూమ్ ల్లో అమ్మకాలు పెంచేలా చర్యలు తీసువాలని ఆదేశించారు. లేపాక్షి షో రూమ్ ల నిర్వహణకు తరంగా అనే యాప్ అనే ఆధారాత వ్యవస్థను సిద్ధం చేశామ్నారు. ఏనాటి అమ్మకాలను ఆనాడే ఈనాటి నుంచే చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత స్పష్టంచేశారు.
మంత్రి సవితతో బీసీ సంఘ నేతల భేటీ
తిరుపతి పర్యటనకు వచ్చిన మంత్రి సవితను పలువురు బీసీ సంఘ ప్రతినిధులు కలిశారు. బీసీల సంక్షేమానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేసి, సత్కరించారు. మరికొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించాలని కోరారు. అందుకు మంత్రి సవిత సుముఖత వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డీబీసీడబ్ల్యూవో భరత్ రెడ్డి సహా చేనేత, జౌళి శాఖ, లేపాక్షి అధికారులు పాల్గొన్నారు. మంత్రి సవితను కలిసిన వారిలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ఆర్.సదాశివ, ఎస్.త్యాగరాజన్, వి.చంద్రశేఖర్ సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Prajavartha Online Telugu News