-సెంట్రల్ ప్రజలకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరానికి మరో మణిహారం వచ్చి చేరనుంది. సెంట్రల్ నియోజకవర్గానికి ఇటీవల నూతనంగా 7 వంతెనలు మంజూరైన నేపథ్యంలో.. తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర గల ఏలూరు కాలువ 1.2 కి.మీ వద్దన, అయోధ్యనగర్ – సత్యనారాయణపురం మధ్య ఏలూరు కాలువ 3.7 కి.మీ. వద్ద మరో డబుల్ లేన్ రోడ్డు బ్రిడ్జిల నిర్మాణానికి తాజాగా ‘ది ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI)’ ఆమోదం తెలిపినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఒక ప్రకటనలో తెలియజేశారు. వీటికి సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలియజేశారు. మరోవైపు తుమ్మలపల్లి సమీపంలో రైవస్ కాలువ 1.2 కి.మీ. వద్దన వంతెన నిర్మాణానికి రూ. 5.29 కోట్ల అంచనాతో గత నెల(అక్టోబర్) 29న టెండర్లకు ఆహ్వానించినట్లు తెలిపారు. నగరంలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ వంతెనల నిర్మాణం దోహదపడుతుందన్నారు. అదేవిధంగా 7 వంతెనల నిర్మాణంతో నగర రూపురేఖలు పూర్తిగా మారిపోవడంతో పాటుగా.. పర్యాటకంగా కూడా నగరం విరాజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవానికి జిల్లాలో డ్రెయిన్లు, వంతెనల నిర్మాణాలన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించినవే అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ దివంగత నేత చేసిన కృషి వల్ల నేడు నగరం అద్భుతంగా రూపుదిద్దుకుందన్నారు. వైఎస్ ఆశయాలను కొనసాగిస్తూ.. నేడు జగన్మోహన్ రెడ్డి ప్రజల సౌకర్యార్థం పలుచోట్ల వంతెనలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వాటి ప్రయోజనాలను వీలైనంత త్వరగా వాహనదారులకు అందించే దిశగా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. నగర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లావాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పునరుద్ఘాటించారు.
Prajavartha Online Telugu News