Breaking News

సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరన

-సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న ఆప్కాబ్ చైర్‌పర్సన్ గన్ని వీరాంజనేయులు, ఎండీ ఆర్.వి. రామకృష్ణ, నాబార్డ్ డిజిఎం ఎం.ఎస్.ఆర్. చంద్ర మూర్తి తదితరులు
సభలో ప్రసంగిస్తున్న ఆప్కాబ్ చైర్‌పర్సన్ గన్ని
-‘సహకారభూమి’ మనుగడకు సంపూర్ణంగా సహకరిస్తాం
-సహకార వ్యవస్థకు ఓ దిక్సూచి ఈ పత్రిక
-ఆప్కాబ్ చైర్మన్ గన్ని, ఎండీ రామకృష్ణ భరోసా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార రంగం విలువలు, విశిష్టత, సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిస్వార్థంగా కృషిచేస్తున్న ‘సహకారభూమి’ పక్షపత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్) అండగా నిలుస్తుందని సంస్థ చైర్‌పర్సన్ గన్ని వీరాంజనేయులు, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి. రామకృష్ణ భరోసా ఇచ్చారు. సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను విజయవాడలోని సహకారభూమి జర్నల్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం ఉదయం గన్ని వీరాంజనేయులు ఆవిష్కరించారు. తొలి ప్రతిని విశిష్ట అతిథిగా హాజరైన నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.ఆర్. చంద్ర మూర్తి, మలి ప్రతిని గౌరవ అతిథి ఆర్.వి. రామకృష్ణకు అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా ఆప్కాబ్ చైర్‌పర్సన్ గన్ని మాట్లాడుతూ.. సహకార రంగం బలోపేతానికి ఇటువంటి పత్రికలు అత్యంత అవసరమని చెప్పారు. సహకారభూమి వ్యవస్థాపకులైన సహకారవేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, సంఘాలు ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా, సహకార ఉద్యమం సజీవంగా ఉండాలని, దాని విలువలు సమాజానికి తెలియజేయాలనే మహోన్నత లక్ష్యంతో ఈ పత్రికను నిర్వహిస్తున్నారని కొనియాడారు. సహకార రంగానికి సంబంధించిన సమాచారం, చరిత్ర, విలువలు, స్ఫూర్తిదాయక గాథలను ప్రజలకు చేరవేస్తూ సహకారభూమి ఒక ఉద్యమంలా పనిచేస్తోందని గన్ని కితాబిచ్చారు. సహకారభూమి కార్యాలయంలో సహకార స్ఫూర్తిని ప్రతిబింబించే నినాదాలు, సహకార ఉద్యమ ప్రముఖుల చిత్రాలు, వారి సేవలను ప్రదర్శించిన తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని చెప్పారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన సహకారోద్యమ సీనియర్ నాయకుడు దాసరి కేశవులును హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ‘సహకారం మన సంస్కృతి – సహజీవనం మన సంప్రదాయం, సంఘశక్తే సహకార శక్తి’ వంటి సందేశాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
నేటి డిజిటల్ యుగంలో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గుతున్నా, సహకార రంగానికి సంబంధించిన అవగాహన కల్పించే పత్రికల అవసరం మరింత పెరిగిందన్నారు. సహకార రంగంలో జరుగుతున్న సేవలు, విజయాలు, సవాళ్లు ప్రజలకు తెలియాలంటే సహకారభూమి వంటి వేదికలు నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉందని గన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో సహకారభూమి పత్రికకు సంస్థాగత మద్దతు అందించే అంశాన్ని ఆప్కాబ్ స్థాయిలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి)లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ప్యాక్స్) స్థాయిలో పత్రిక విస్తరణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ అంశాన్ని ఆప్కాబ్ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి, సహకారభూమికి సాధ్యమైనంత సహకారం అందించే దిశగా కృషి చేస్తామని గన్ని వివరించారు.
సహకార రంగానికి సేవలందిస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు అందించగలిగే మద్దతు, సహాయంపై నాబార్డ్ అధికారులతోనూ చర్చిస్తామని తెలిపారు. సహకారభూమి సహకార విలువలను పరిరక్షిస్తూ, రైతులు, మహిళా సంఘాలు, ఉద్యోగులు, మేధావుల్లో సహకార స్ఫూర్తిని పెంపొందించే దిశగా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాబోయే తరాల మనస్సుల్లో సహకార భావజాలం నిలిచిపోయేలా పత్రిక చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తూ ఎడిటర్ అక్బర్ పాషా, న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణ, పత్రిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. పత్రిక డిజిటల్ రూపంలోనూ అందుబాటులోకి రావాలని సూచిస్తూ, అందుకు వ్యయమయ్యే 50 వేల రూపాయలు, పత్రిక కార్యాలయం నిర్వహణకు మరో 10 వేల రూపాయలను వ్యక్తిగత విరాళంగా ప్రకటించి, అక్కడికక్కడే అందజేశారు.
గౌరవ అతిథిగా హాజరైన ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి. రామకృష్ణ సందేశమిస్తూ.. పత్రిక అన్ని సంఘాలకు చేరాల్సిన అవసరముందని, ఇందుకు ఆప్కాబ్ చేయూతనిస్తుందని చెప్పారు. వెబ్సైట్ రూపకల్పన కోసం ఆయన కూడా సంస్థ తరపున 50 వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా ఆప్కాబ్ అందిస్తుందని భరోసా ఇచ్చారు. విశిష్ట అతిథిగా నాబార్డ్ ప్రతినిధి చంద్ర మూర్తి సందేశమిస్తూ.. సహకారభూమి పత్రిక అత్యవసరంగా డిజిటల్ రూపంలోకి రావాల్సిన అవసరముందన్నారు. పత్రికకు నాబార్డ్ అందించే సాయంపై కూడా ఆలోచన చేస్తామని, తమ సంస్థ నుంచి కూడా సాంకేతిక సహకారం పొందవచ్చని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి వెటరన్ జర్నలిస్ట్ వడ్లమూడి పద్మావతి అధ్యక్షత వహించారు. సీనియర్ జర్నలిస్ట్, పాత్రికేయుల సంఘ నేత చావా రవి సభకు స్వాగతం పలికారు. సీనియర్ సహకరవాదులు, జర్నలిస్టులు దాసరి కేశవులు, ఇఫ్కో రవీంద్ర, జి.వి. రంగారెడ్డి, ప్రసాదరెడ్డి, టి.వి. నరసింహారావు, దుర్గరాజు స్వాతి, డి. రామారావు, వై. శ్రీనివాసరావు, శివప్రసాద్, జి. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *