అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తోతపూరి మామిడి రైతులను తప్పుదోవ పట్టిస్తూ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వర్గాలు, కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు చేస్తున్న విష ప్రచారాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనుగోళ్లు, పల్ప్ పరిశ్రమలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల్లో అసత్యాలు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రైతుల్లో అయోమయం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగానే ఈ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ మరోసారి తన నీచమైన, దిగజారుడు రాజకీయాలకు తెరలేపిందని మంత్రి విమర్శించారు. రైతుల సంక్షేమం వంటి సున్నితమైన అంశాలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అత్యంత బాధ్యతారాహిత్యమని అన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడం, ప్రభుత్వంపై బురదజల్లడం, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించడం వైసీపీకి అలవాటుగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రభుత్వం రైతుల పక్షానే నిలుస్తుంది. ఆధారాలు లేకుండా అబద్ధాలు సృష్టించి వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో వైరల్ చేస్తే సహించేది లేదు. అలాంటి వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం అని మంత్రి హెచ్చరించారు. గత ఏడాది మామిడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. రైతులకు నష్టం జరగకుండా తీసుకున్న చర్యల వల్ల వేలాది మంది రైతులకు ఊరట లభించిందన్నారు. ఈ ఏడాది కూడా మామిడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా, పరిశ్రమలతో సమన్వయం ఉండేలా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. రైతుల పేరుతో రాజకీయాలు చేసే వైసీపీ నేతలు, సోషల్ మీడియా ముఠాలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి పూర్తి నిబద్ధత ఉందని, వారి ప్రయోజనాలను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. మామిడి రైతులు ఎవరూ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News