-ప్రధానిగా రికార్డు దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీక
-సమర్ధ నాయకత్వంతో దేశ గతిని మార్చిన శ్రీ మోడీ
-ప్రధాని మోడీ రికార్డు దేశానికి హితమన్న వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికైన ప్రధాన మంత్రుల్లో అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానిగా నరేంద్ర మోడీ బుధవారం రికార్డు నెలకొల్పడం నవ భారత ఆవిష్కరణకు శుభ సూచకమని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. మే 26, 2014న ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన మోడీ రేపటికి (బుధవారం) ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. ఇప్పటి వరకు దేశ ప్రధానులుగా చేసిన 11 మందిలో మొదటి ప్రధాని స్వర్గీయ నెహ్రూ 4,398 రోజులు పదవిలో ఉన్నారు.
గత పన్నెండేళ్లలో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో పలు రంగాల్లో అనూహ్యమైన, సానుకూలమైన, ప్రజోపకరమైన మార్పులు సంభవించాయని, ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా దేశ ఖ్యాతి ఇనుమడించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారంనాడు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
సమర్ధ నాయకత్వం-ప్రజల విశ్వాసం
2014 లోక్ సభ ఎన్నికలకు ముందు కొన్నేళ్లుగా దేశంలో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితుల వల్ల నైరాశ్యానికి గురై సమర్ధవంతమైన నాయకుని కోసం ఉవ్విళ్లూరిన ప్రజలు శ్రీ నరేంద్ర మోడీని స్పష్టమైన మెజారిటీతో ప్రధానిగా ఎన్నుకున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ గుర్తు చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు వారు తనపట్ల ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సమర్ధ నాయకత్వం, సుపరిపాలన, సంస్కరణలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పటిష్ట అమలు ద్వారా మరో రెండు సార్లు ప్రధానిగా ఎన్నికవడం విశేషమని మంత్రి అన్నారు.
10 కోట్లకు పైగా ఎల్పీజీ కనెక్షన్ల ద్వారా వంట చేసే మహిళల సమస్యల్ని పరిష్కరించడం మొదలుకొని అంతరిక్షంలో అద్భుత విజయాలు సాధించే దిశగా మోడీ నాయకత్వంలో నవ భారతం వడివడిగా అడుగులు వేసిందని, దేశ ఆర్థిక వ్యవస్థ మూడు రెట్లు విస్తరించిందని, ప్రపంచంలో దేశ ఖ్యాతి ఎంతగానో ఇనుమడించిందని మంత్రి వివరించారు. పలు రంగాల్లో సాంకేతిక విజ్ఞానానికి పెద్ద పీట వేస్తూ ప్రజోపయోగం కోసం పెను మార్పుల్ని తెచ్చారని, యుపిఐ ద్వారా 24,000 కోట్ల లావాదేవీలు అత్యంత సులభంగా జరగడం దీనికి నిదర్శనమని మంత్రి అన్నారు.
రూ. 45 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి), 57 కోట్ల జన్ ధన్ అక్కౌంట్లు, భారీ స్థాయిలో ఉన్నత విద్యావైద్య సంస్థల విస్తరణ, రైతులకు పెట్టుబడి సాయం, భారీ స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణ, దేశ వ్యాప్తంగా మౌలిక వసతుల విస్తరణ, జీయస్టీ ద్వారా పన్నుల సంస్కరణ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ వంటి ప్రభావంతమైన చర్యలు, నిర్ణయాల ద్వారా ప్రధాని శ్రీ మోడీ దేశ ప్రజలకు ప్రీతిపాత్రుడయ్యారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దేశ సరిహద్దుల్లో సాహసోపేతమైన సర్జికల్ దాడుల ద్వారా శత్రువుల గుండెల్లో ప్రధాని మోడీ భయాన్ని నింపి దేశ భద్రతకు భరోసానిచ్చారని, వామపక్ష హింసాత్మక చర్యల్ని అరికట్టి అంతర్గత రక్షణను ప్రధాని మోడీ పటిష్టం చేశారని మంత్రి వ్యాఖ్యానించారు.
‘వికసిత్ భారత్’ లక్ష్యంగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధానిని నరేంద్ర దామోదర దాస్ భారత్ మోడీగా పిలుచుకోవడం సముచితంగా ఉంటుందని మంత్రి అన్నారు.
Prajavartha Online Telugu News