-ఆర్ధిక వృద్ధి విశ్లేషణకు నెలవారీ నివేదికలు
-జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకునేలా సామర్ధ్యాల పెంపు
-ఏఐతో పన్నులు, రెవెన్యూ వసూళ్లపై దృష్టి
-జీఎస్డీపీ లక్ష్యాలు, కేపీఐపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్థూల ఉత్పత్తి, రాష్ట్రంలోని ఆర్ధిక వృద్ధిని విశ్లేషించేందుకు నెల వారీ నివేదికల్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర- క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను విశ్లేషించేందుకు ప్రతి నెలా నిర్దేశిత తేదీన ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరంలో నమోదయ్యే వివిధ గణాంకాల ద్వారా ఎప్పటికప్పుడు జీఎస్డీపీ లక్ష్యాన్ని సమీక్షించు కునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్లపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్లను సాధించే అంశంపై సీఎం దిశానిర్దేశం చేశారు. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికలను మెరుగు పరచడం, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలతో పాటు రియల్ గ్రోత్ ఆధారంగా పనితీరును అంచనా వేసేలా స్కోరింగ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై చేసే వ్యయంపై 3.5 రెట్ల మేర ఆర్ధిక కార్యకలాపాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందని రియల్ టైమ్ లో ఈ ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణకు ఓ ఏఐ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా డేటా డ్రివెన్ గవర్నెన్సుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ రంగంలోనూ గ్రాస్ వాల్యూ అడిషన్ ను పెంచేందుకు శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. తయారీ, గనులు, వాణిజ్యం,రవాణా తదితర రంగాలతో పాటు అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్ పోర్టులతో ఆర్ధిక వ్యవస్థకు మల్టిప్లైయర్ ఎఫెక్ట్ వచ్చేలా ప్రణాళికలు చేపట్టాలన్నారు. అధికారులు, ఉద్యోగుల సామర్ధ్యాల పెంపుపై జూలై 2-3 తేదీల్లో రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహించాలని సీఎం సూచించారు. జీఎస్టీ సహా పన్ను వసూళ్లపై పూర్తి సాంకేతికతను వినియోగించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, ఆర్ధిక, ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యాన, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News