Breaking News

ఏపీ ఈజ్ బ్యాక్-దేశవ్యాప్త చర్చగా మారిన నాయుడు గిరీ

-రాష్ట్రానికి వరదలా పెట్టుబడులు… చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంఓయూల ఛేజింగ్
-రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిన 800 కంపెనీలు
-ప్రాసెస్ లోకి వచ్చిన 68 శాతం ఎంఓయూలు
-పెట్టుబడుల సాకారానికి నిత్యం కేంద్రంతో సంప్రదింపులు
-ఎంఓయూల అమలుకు ప్రత్యేక నోడల్ అధికారులు… జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు
-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మారుతోన్న ఏపీ ముఖ చిత్రం
-ఎంఓయూల అమలును నిరంతరం పర్యవేక్షిస్తోన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం శరవేగంగా మారుతోంది. రెండేళ్లల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి సీఎం చంద్రబాబు పారిశ్రామిక విధానంలో తన స్టైల్ మార్చారు. గతానికి భిన్నంగా వెళ్లడం మొదలు పెట్టారు. 2014-19 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అవలంభించింది. ఆ స్పీడుతోనే నాడు కొన్ని కీలక పెట్టుబడులు తెచ్చింది. కియా కార్ల కంపెనీని తెచ్చి ఉమ్మడి అనంతపురం జిల్లా.. ప్రత్యేకించి పెనుకొండ ప్రాంతం రూపు రేఖలు మార్చింది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. దీంట్లో భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి.. భారీ స్థాయిలో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. గత రెండేళ్ల కాలంలో సుమారు 800 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరిచాయి. ప్రస్తుతం రెండేళ్ల కాలంలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ఆసక్తి కనబరిస్తే.. వీటి ద్వారా సుమారు 23 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. వీటిల్లో రూ. 21.64 లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ ఎంఓయూల ద్వారానే వస్తున్నాయి. 2025 ఏడాదిలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలతో పాటు… వివిధ వేదికల మీద.. వివిధ సందర్భాల్లో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కలిపి మొత్తంగా రూ. 21.64 లక్షల కోట్లుగా ఉంటే.. వీటి ద్వారా 21.20 లక్షల ఉద్యోగాలు రానున్నాయి.

రికార్డు స్థాయిలో పెట్టుబడులు… పర్ఫెక్ట్ మానిటరింగ్

“ఆంధ్రప్రదేశ్ ఈజ్ బ్యాక్” అనే నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రం వైపు చూడటానికే భయపడి, పెట్టుబడులు వెనక్కి తీసుకుని పారిపోయిన కంపెనీలు… నేడు ఏపీ వైపు క్యూ కడుతున్నాయి. ఎంఓయూలు కుదుర్చుకోవడం.. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టేయడమనేది గతంలో జరిగిన వ్యవహరం. ఆ విధానానికి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఎంఓయూల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కుదుర్చుకున్న ఎంఓయూలను నిరంతరం మానిటర్ చేసేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా… కుదిరిన ప్రతి ఒప్పందాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, కంపెనీలు క్షేత్రస్థాయిలోకి వచ్చేలా ప్రభుత్వం చేస్తున్న ‘ఛేజింగ్’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంటే ఏమిటో ఏపీ దేశానికి కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఫలితంగానే దేశానికి వచ్చిన FDIల్లో 25.3 శాతం FDIలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. పెట్టుబడుల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అధికారులకు ప్రత్యేకంగా అప్పగించింది. కేవలం అధికారులుగా కుర్చీలకే పరిమితం కాకుండా… ప్రభుత్వం తరపున మార్కెటింగ్ మేనేజర్లుగా మారి పారిశ్రామికవేత్తల వెంట పడాలి.. వారి సమస్యలను పరిష్కరించి పరిశ్రమలు స్థాపించేలా చూడాలని సీఎం చంద్రబాబు నిరంతరం అధికారులకు నిర్దేశిస్తూ ఉంటారు. ఎంఓయూల అమలుకు మూడు రీజియన్లకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించడంతో పాటు, జిల్లా కలెక్టర్లకు నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించారు. ఎంఓయూల విషయంలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా నిరంతరం ఛేజింగ్ చేస్తుండడం వల్లే వల్లే అతి తక్కువ కాలంలోనే కంపెనీలు సాకారమవుతున్నాయి.

36 రోజుల్లోనే ‘ఆమ్కా’.. గూగుల్ కోసం నిబంధనల మార్పు

పెట్టుబడులు, పరిశ్రమలను గ్రౌండ్ చేసే విషయంలో ప్రభుత్వ వేగానికి, పట్టుదలకు AMCA ప్రాజెక్టే నిలువెత్తు నిదర్శనం. కేవలం 36 రోజుల్లోనే ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో అడుగుపెట్టి పనులు ప్రారంభించింది. ఆమ్కా విషయంలోనే కాదు.. ఇదే వేగంతో… కేంద్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ, ప్రత్యేక ఫోకస్ పెట్టడం ద్వారా దిగ్గజ సంస్థలన్నీ ఏపీ వైపు చూస్తున్నాయి. ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడం కోసం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చర్చించి.. అవసరమైన మేరకు నిబంధనల్లోనే కీలక మార్పులు చేసేందుకు అంగీకరించేలా కేంద్రాన్ని ఒప్పించారు. అలాగే ఆర్సెల్లార్ మిట్టల్ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా స్లర్రీ పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ఒప్పించగలిగారు. ఈ విధంగా ఏపీలో పారిశ్రామికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. తద్వారా ఏపీకి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు.. కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసేందుకు మార్గాన్ని కల్పిస్తోంది. ఏపీకి పొరుగునున్న రాష్ట్రాలను కాదని ఏపీకి కంపెనీలు క్యూ కట్టడం ఆయా రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో పెట్టుబడుల విషయంలో నాయుడు గిరీ అంటూ జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాలు ఆయా రాష్ట్రాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తమిళనాడును కాదని ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో తమిళనాడులో జరిగిన చర్చే దీనికి నిదర్శనం.

ఎంఓయూల సాకారమిలా…

గతంలో లక్షల కోట్ల ఎంఓయూలు అంటూ ప్రచారం జరిగి.. క్షేత్రస్థాయిలో రూపాయి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రూ. 21.64 లక్షల కోట్ల మొత్తం ప్రతిపాదిత పెట్టుబడుల్లో గణనీయమైన పురోగతి కన్పిస్తోంది. ఇప్పటికే ప్రాసెస్ లోకి వచ్చిన ఎంఓయూలు 68.02 శాతంగా ఉన్నాయి… డీపీఆర్ సబ్మిషన్ నుంచి గ్రౌండింగ్ దశ వరకు చేరిన ఎంఓయూలు 60.44 శాతంగా ఉంటే… భూ కేటాయింపులు దశను పూర్తి చేసుకున్న ఎంఓయూలు 21.39 శాతంగా ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో అతి తక్కువ కాలంలో మిగిలిన 68 శాతానికి పైగా పెట్టుబడులు ఇప్పటికే ప్రాసెస్ లోకి కీలక పరిణామంగా చెప్పవచ్చు. పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీలు రూపొందిస్తూ ముందుకు వెళ్తుండడంతో ఏపీపై పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం పెరిగింది. అధికారుల్లో జవాబుదారీతనం కూడా పెరగడంతో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వర్గాల్లో “ఏపీ ఈజ్ బ్యాక్” అనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యువతకు లక్షలాది ఉద్యోగాలు రావడం ఖాయమనే అభిప్రాయం వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *