-బోండా ఉమాను హెచ్చరించిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు
-నాడు పెట్రోల్, డీజిల్‌పై చంద్రబాబు సర్‌చార్జి విధించింది మర్చిపోయారా?
-పేదవాడి ఇంట వంటింటి సంక్షోభం ఏర్పడింది మీ తెలుగుదేశం పాలనలో కాదా..?
-శర్వాణీ మూర్తి, జానారెడ్డి, బాలిగోవింద్, కొంగితల లక్ష్మీపతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెలుగుదేశం నేతలు నాయకులు ధర్నా చేయవలసింది గల్లీలలో కాదని.. ఢిల్లీలో చేయాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సవాలు విసిరారు. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా వారు ఖండించారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనే ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక రూపంలో ప్రభుత్వంపై బురద జల్లేందుకు తెలుగుదేశం నాయకులు తయారుగా ఉంటారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారని.. ఇప్పటివరకు వెలువడిన వరుస ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం చేస్తున్న తప్పుడు విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పాలనలో గత ఐదేళ్లు విపరీతంగా ధరలు పెంచి.. ఇవాళ నిర్లజ్జగా బోండా ఉమా నీతిసూక్తులు చెబుతున్నారని వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. కనీస విషయ జ్ఞానం, ఇంగితం లేకుండా బోండా ఉమా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 2015 ఫిబ్రవరి 5 నుంచి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రూ.4 చొప్పున వ్యాట్ విధించింది టీడీపీ సర్కారు కాదా అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా పెట్రో బాదుడు బాది.. ప్రజల నడ్డి విరిచారని గుర్తు చేశారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలను ఎన్నడూ పెంచలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కనీసం దృష్టి పెట్టలేదని.. ఫలితంగా రహదారులన్నీ పూర్తిగా దెబ్బతిని ఇబ్బందికరంగా తయారయ్యాయన్నారు. పైగా రోడ్లు వేస్తామంటూ బ్యాంకుల నుంచి చంద్రబాబు రూ.3,800 కోట్లు అప్పు తీసుకు వచ్చి రోడ్లు వేయకుండా.. పసుపు-కుంకుమ కింద పంచిపెట్టారన్నారు. మీరు చేసిన తప్పిదాలకు ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రూ.2,205 కోట్లతో 8,970 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం లీటరు మీద కేవలం రూ.1 మాత్రమే సుంకంగా విధించాల్సి వచ్చిందని వివరించారు. మరోవైపు నిత్యావసర సరుకుల గూర్చి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశం నాయకులకు ఏ మాత్రం లేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అన్నారు. గత టీడీపీ పాలనలో నిత్యావసరాల ధరలు ఇష్టానుసారంగా పెంచడంతో.. నోటిలోకి ఐదేళ్లు పోలేని దురవస్థలో సామాన్య ప్రజలు బ్రతుకీడ్చిన సందర్భాలను గుర్తుచేశారు. గత చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఎంత ట్యాక్స్‌లు వసూలు చేశారు..? రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత..? చేసిన అప్పులతో వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్లాయి..? వీటన్నింటి లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. అంతేకానీ పెట్రోల్ బంకులపై దాడులు చేస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బోండా ఉమాకు దమ్ముంటే చంద్రబాబుకు చెప్పి ఢిల్లీలో ధర్నా చేయాలని సవాల్ విసిరారు.
Prajavartha Online Telugu News