-నిరుపేదలు అందరికీ న్యాయం అందించే న్యాయ సహాయ ఉద్యమం గా అభివర్ణణ
-రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నిస్సహాయత వల్ల న్యాయం పొందలేని అణగారిని వర్గాల ప్రజలకు, నిరుపేదలకు, నిరక్షరాస్యులకు అన్ని విదాలైన న్యాయ సేవలు అందించాలనే దృక్పధంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయ సేవల కమిటీ రూపొందించిన మిషన్ లీగల్ సర్వీసెస్ ను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మంగళవారం ప్రారంభించారు. అమరావతి నేలపాడు లోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆవరణలో మంగళవారం ఈ మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ ఆజాదీకా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూడిల్లీ వారు ఇచ్చిన పిలుపు మేరకు మిషన్ లీగల్ సర్వీసెస్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, తుళ్లూరు మరియు కృష్ణా జిల్లాలోని పెనమలూరు మండలాల్లో ఎంపిక చేయబడిన గ్రామాలను న్యాయసేవాధికార సంస్థలు దత్తత తీసుకుని ఈ మిషన్ లీగల్ సర్వీసెస్ ను ప్రారంభిస్తాయని ఆయన తెలిపారు. దత్తత తీసుకున్న గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలు/ ఉన్నత /ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లో ఈ నెల 14 వ తేదీలోపు న్యాయ సేవల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తాడేపల్లి మండలంలోని చిర్రావూరు, గుండిమెడ, ఇప్పటం, కొలనుకొండ, కుంచనపల్లి, పెనుమాక, తాడేపల్లి, ఉండవల్లి గ్రామాలు, సత్తెనపల్లి మండలంలోని ఫణిదం, గుడిపూడి, నందిగారు, పెదమక్కెన గ్రామాలు, ప్రత్తిపాడు మండలంలోని యనమదల, ఈదులపాలెం, తమ్మలపాలెం, గొట్టిపాడు, గనికపూడి గ్రామాలు, తుళ్లూరు మండలం వెలగపూడి, ఐనవోలు, శాఖమూరు గ్రామాలు మరియు పెనమలూరు మండలాల్లోని పెనమలూరు, కానూరు, తాడిగడప, యనమలకుదురు, వణుకూరు, గోశాల గ్రామాలలో న్యాయ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో ప్రధాన సమస్యలతోపాటు త్రాగునీరు, మురుగునీటి సమస్యలు మరియు మహిళలు, పిల్లలు, వృద్ధులు, అసంఘటిత కార్మికులు, ట్రాన్స్ జెండర్లు, ట్రాఫికర్స్ , రైతులు మరియు కరోనా బాధితుల సమస్యలను గుర్తించడానికి గాను ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. న్యాయ కళాశాలలకు చెందిన న్యాయ విద్యార్థులు, ఎంపిక చేయబడిన న్యాయవాదులు ఈ కోర్ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో పరిష్కరించాల్సిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేయాల్సి వచ్చే అంశాలకు సంబందించి ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కమిటీలలో సభ్యులుగా గ్రామాల్లో పర్యటించనున్న న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ మిషన్ విజయవంతంగా అమలు చేయడంలో న్యాయ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమన్నారు. న్యాయ వ్యవస్థకు , పౌరులకు మధ్య వీరు ఒక బ్రిడ్జి లాగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కీలక భూమిక పోషించాలన్నారు. వారి సమస్యలను కోర్టు దాకా తీసుకు రాకుండా మధ్యవర్తిత్వంతో అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అనంతరం దత్తత తీసుకున్న రెవెన్యూ గ్రామాల పర్యటనకు బయలుదేరిన వాహనాలను జెండా ఊపి రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రారంభించారు
ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ పౌరులందరికీ సమన్యాయం అందజేసేందుకు , వారి హక్కులను కాపాడుకునేందుకు అత్యద్భుతమైన చట్టాలు ఉన్నాయని అయితే దురదృష్టవశాత్తూ అవగాహన రాహిత్యంతో అవి వారికి చేయడం లేదని ఆయన అన్నారు. అటువంటి చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించే కీలక భూమికను న్యాయ విద్యార్థులు పోషించి ఈ మిషన్ అమలును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమస్యలన్నిటినీ పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని మానవతా కోణంలో వారికి సరైన సలహాలు ఇస్తూ సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. అంతేగాని ప్రతి వివాదాన్ని కోర్టు దాకా తీసుకు రావడం సరికాదని విద్యార్థులకు ఆయన హితవు పలికారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జస్టిస్ ఏవీ శేషసాయి మాట్లాడుతూ స్వతంత్ర భారతావని ఏర్పడి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆజాదీకా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ మిషన్ ను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మిషన్ అమలుకు రాష్ట్ర హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో 6 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 8 న్యాయ కళాశాల కు చెందిన ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, న్యాయ విద్యార్థులు మరియు 41 మంది అడ్వకేట్లు సభ్యులుగా ఈ కమిటీలను ఏర్పాటు జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ సెక్రెటరీ ఎంవి రమణ కుమారి మాట్లాడుతూ 2019 లో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ ద్వారా ఇప్పటి వరకూ 304 మందికి న్యాయ సహకారం అందించడం జరిగిందని, 53 మందికి సుప్రీం కోర్టులో కేసులు దాఖలు చేయడానికి సహకరించామని, రాష్ట్ర హైకోర్టులో పెండింగ్ లోనున్న 4 వేల కేసులను లోక్ అధాలత్ ద్వారా పరిష్కరించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె. జానకి రామి రెడ్డి, సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. దివాకర్ బాబు ప్రసంగించగా పలువురు న్యాయాధికారులు, అడ్వకేట్లు, పలు న్యాయ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News